బొప్పాయి పండు మనకు సహజంగానే ఏడాదిలో ఎప్పుడైనా లభిస్తుంది. ఇది సీజన్లతో సంబంధం లేకుండా మనకు అందుబాటులో ఉంటుంది. ఈ పండ్లను తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వీటిల్లో అనేక ఔషధ గుణాలు, పోషక విలువలు ఉంటాయి. బొప్పాయి పండ్లలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లను నేరుగా తినవచ్చు. లేదా జ్యూస్, మిల్క్ షేక్, స్మూతీ రూపంలోనూ తీసుకోవచ్చు. అయితే నేరుగా తింటేనే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. బొప్పాయి పండ్లను తరచూ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మన శరరీంలో జరిగే మెటబాలిజం ప్రక్రియలో ఫ్రీ ర్యాడికల్స్ విడుదల అవుతుంటాయి. ఇవి శరీరానికి హాని చేస్తాయి. అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తాయి. అయితే వీటిని నిర్మూలించేందుకు మనం యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఆహారాలను నిత్యం తినాల్సి ఉంటుంది. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లలో ఉండే కెరోటినాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్‌లా పనిచేస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్ ను నాశనం చేస్తాయి. మన శరీరాన్ని సంరక్షిస్తాయి.
బొప్పాయి పండ్లలో లైకోపీన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది యాంటీ క్యాన్సర్ గుణాలను కలిగి ఉంటుంది. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. క్యాన్సర్‌లు రాకుండా చూస్తుంది. క్యాన్సర్ చికిత్స తీసుకునే వారు బొప్పాయి పండ్లను తినాలని వైద్యులు కూడా సూచిస్తుంటారు.
బొప్పాయిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతాయి. ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థలోని సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి. ఇన్ఫెక్షన్లను కలిగించే క్రిములు నాశనం అవుతాయి. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ ర్యాడికల్స్ వల్ల చర్మ కణాలు కూడా నాశనం అవుతాయి. అయితే బొప్పాయి పండ్లను తినడం వల్ల వాటిల్లో ఉండే లైకోపీన్, విటమిన్ సి లు ఆ ఫ్రీ ర్యాడికల్స్ ను నాశనం చేస్తాయి. దీంతో చర్మం సంరక్షించబడుతుంది. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. బొప్పాయి పండ్లతో ఫేస్ మాస్క్‌లు తయారు చేసుకుని వాడవచ్చు. దీంతో ముఖంపై మచ్చలు, ముడతలు తగ్గుతాయి. వృద్ధాప్య ఛాయలు కనిపించవు.
బొప్పాయి పండ్లలో ఉండే విటమిన్ సి, ఫోలేట్, విటమిన్ ఇ లు మలబద్దకాన్ని తగ్గిస్తాయి. మలబద్దకం ఉన్నవారు నిత్యం బొప్పాయి పండ్లను తినడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. ఈ పండ్లను తింటే సుఖ విరేచనం అవుతుంది. జీర్ణాశయం తేలిగ్గా ఉన్నట్లు అనిపిస్తుంది. వికారం తగ్గుతుంది. జీర్ణ సమస్యలు ఉండవు.
రుతు క్రమం సరిగ్గా లేని మహిళలు పచ్చి బొప్పాయి పండు జ్యూస్‌ను నిత్యం తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. దీని వల్ల మహిళల శరీరంలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది పీరియడ్స్ సరిగ్గా వచ్చేలా చేస్తుంది.
బొప్పాయి పండు గుజ్జును నేరుగా మొటిమలపై రాస్తుంటే కొద్ది రోజుల్లోనే మొటిమలు తగ్గిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. నిత్యం దీన్ని తిన్నా కూడా అదే ఫలితాన్ని పొందవచ్చు. బొప్పాయి మొటిమలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.