Watermelon : వేసవి సీజన్లో మనకు విరివిగా లభించే పండ్లలో పుచ్చకాయలు ఒకటి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిల్లో ఉండేది 90 శాతం నీరే. కనుక వేసవిలో వీటిని తింటే మనకు నీరు లభిస్తుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. వేసవి తాపం తగ్గుతుంది. శరీరం చల్లబడుతుంది. అయితే మనకు మార్కెట్లో లేదా బయట రహదారుల పక్కన చాలా మంది పుచ్చకాయలను విక్రయిస్తూ కనిపిస్తారు. వారి దగ్గర మనం వాటిని కొంటుంటాం. కానీ అవి తియ్యగా ఉంటాయో.. చప్పగా ఉంటాయో.. నీరు బాగా ఉంటుందో.. ఉండదో.. మనకు తెలియదు. తీరా కొన్న తరువాత మనం అనుకున్నట్లు అవి లేకపోతే డబ్బులు వృథా అయ్యాయని చింతిస్తుంటాం. కానీ కింద తెలిపిన చిట్కాల ద్వారా పుచ్చకాయలు ఎలాంటివో చాలా సులభంగా చెప్పేయవచ్చు. మరి తియ్యగా ఉండే పుచ్చకాయలను ఎలా గుర్తించాలంటే..
పొడవుగా కోడిగుడ్డు ఆకారంలో ఉండే పుచ్చకాయల్లో నీరు అధికంగా ఉంటుంది. అందువల్ల ఇవి అంత తియ్యగా ఉండవు. అదే.. గుండ్రంగా.. గుమ్మడికాయ షేప్లో ఉండే పుచ్చకాయల్లో అయితే నీరు తక్కువగా ఉంటుంది. కానీ అవి తియ్యగా.. రుచికరంగా ఉంటాయి. ఇలా తియ్యగా ఉండే పుచ్చకాయలను సులభంగా గుర్తించవచ్చు.
ఇక పుచ్చకాయ కింది భాగంలో క్రీమ్ కలర్ ప్యాచ్లాగే ఉంటే ఆ కాయ బాగా పండిందని గుర్తించాలి. అదే ప్యాచ్ నారింజ – పసుపు రంగులో ఉంటే ఇంకా బాగా పండిందని.. రుచి బాగా ఉంటుందని తెలుసుకోవాలి.
ఇక బరువు కూడా మరీ ఎక్కువగా ఉన్నవి.. మరీ తక్కువ బరువు ఉన్నవి కాకుండా.. మధ్యస్థంగా బరువు ఉన్న పుచ్చకాయలను ఎంపిక చేసుకోవాలి. ఇవి రుచిగా ఉంటాయి. ఇక పుచ్చకాయకు ఉండే తొడిమ ఆకుపచ్చ రంగులో ఉంటే అది సరిగ్గా పండలేదని అర్థం. తొడిమ బాగా ఎండిపోయి ఉండాలి. అలా ఉంటే ఆ కాయ బాగా పండిందని.. రుచిగా ఉంటుందని గుర్తించాలి. ఇలా పుచ్చకాయలను కొనుగోలు చేసేటప్పుడు ఈ సూచనలు పాటిస్తే ఎంతో రుచికరమైన పుచ్చకాయలను కొని తినవచ్చు.