Seema Chinthakaya : మనకు వివిధ రకాల పండ్లు, కూరగాయలు కాలానుగుణంగా లభిస్తూ ఉంటాయి. ఇలా కాలానుగుణంగా లభించే పండ్లను తినడం వల్ల మనం ఆ కాలంలో వచ్చే అనారోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇలా కాలానుగుణంగా లభించే వివిధ రకాల పండ్లల్లో సీమ చింతకాయలు కూడా ఒకటి. వేసవి కాలంలో ఇవి ఎక్కువగా లభిస్తాయి. గ్రామాల్లో ఉండే వారికి వీటి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఈ కాయలు పొన చర్మం గులాడి, ఎరుపు రంగుల్లో ఉంటుంది. లోపల తెల్లగా ఉండే గుజ్జుతో పాటు నల్ల రంగులో ఉండే గింజ కూడా ఉంటుంది. ఈ తెల్ల గుజ్జును మాత్రమే మనం ఆహారంగా తీసుకోవాలి.
అలాగే ఈ కాయలు తీపి, వగరు రుచిని కలిగి ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ సీమ చింతకాయలను జింగిలం జిలేజి అని కూడా పిలుస్తూ ఉంటారు. రుచితో పాటు ఈ కాయలను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో పీచు పదార్థాలు, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. కొవ్వులు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. అలాగే ఈ సీమ చింతకాయల్లో విటమిన్ బి1, బి6, ఎ, సి వంటి విటమిన్స్ కూడా ఉంటాయి. ఈ కాయలను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తం శుద్ది అవుతుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్ లభ్యమవుతాయి. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
అలాగే సీమ చింతకాయలను బాగా నమిలి తినడం వల్ల దంతాలు శుభ్రపడతాయి. ఎముకలను ధృడంగా చేయడంలో కూడా ఈ కాయలు మనకు సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునే వారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, కంటి చూపును పెంచడంలో కూడా ఈ కాయలు మనకు సహాయపడతాయి. అదే విధంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వీటిని తీసుకోవడం వల్ల మరింత మేలు కలుగుతుంది. శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నీ చక్కగా అందుతాయి. గర్భిణీ స్త్రీలల్లో వచ్చే మలబద్దకం సమస్యను తగ్గించడంలో ఈ కాయలు ఎంతో ఉపయోగపడతాయి.
ఈ కాయలను తినడం వల్ల నాడీ మండల వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. రక్తనాళాలు చక్కగా పని చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. అంతేకాకుండా ఈ సీమచింతకాయలను తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ఈ విధంగా సీమ చింతకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఇవి లభించే కాలంలో వీటిని తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.