ప్రపంచ వ్యాప్తంగా హైబీపీ బారిన పడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. మన దేశంలో 30 శాతం మంది అధిక రక్తపోటు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. ఇది సైలెంట్ కిల్లర్‌లా వస్తోంది. హైబీపీ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. వయస్సు మీద పడడం, వంశ పారంపర్యంగా రావడం, స్థూలకాయం, ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం వంటి అనేక కారణాల వల్ల హైబీపీ వస్తుంటుంది.
అయితే హైబీపీ వచ్చిన వారు కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే రక్త నాళాలు దెబ్బ తింటాయి. అవయవాలకు నష్టం కలుగుతుంది. మెదడు, గుండె, కళ్లు, కిడ్నీలపై ప్రభావం పడుతుంది. హార్ట్ ఎటాక్ లు వస్తాయి. కనుక హైబీపీ వచ్చిందంటే డాక్టర్లు ఇచ్చే మందులను రెగ్యులర్‌గా వాడడంతోపాటు ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల హైబీపీ నుంచి బయట పడవచ్చు. బీపీ నియంత్రణలో ఉంటుంది. అందుకు గాను రోజూ తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. సిట్రస్ పండ్లు: వీటిల్లో అనేక రకాల పండ్లు ఉన్నాయి. ద్రాక్షలు, నారింజ, నిమ్మ వంటి వాటిల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, వృక్ష సంబంధ సమ్మేళనాలు ఉంటాయి. అందువల్ల వీటిని తీసుకుంటే బీపీ తగ్గుతుంది.
2. విత్తనాలు: గుమ్మడికాయ విత్తనాలు, చియా సీడ్స్, అవిసె గింజలలో మెగ్నిషియం, పొటాషియం, ఆర్గైనైన్, అమైనో యాసిడ్లు ఉంటాయి. ఇవి బీపీని తగ్గిస్తాయి.
3. బీన్స్, పప్పు దినుసుల్లో ఫైబర్, మెగ్నిషియం, పొటాషియం వంటివి అధికంగా ఉంటుంది. ఇవి బీపీని తగ్గించేందుకు సహాయ పడతాయి. కనుక వీటిని తరచూ తీసుకోవాలి.
4. బెర్రీలు: స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీలు, చెర్రీ పండ్లలో అనేక పోషకాలు, ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువల్ల వీటిని తింటే బీపీ నియంత్రణలోకి వస్తుంది.
5. ఆకుపచ్చని కూరగాయలు: వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నిషియం ఉంటాయి. అందువల్ల బీపీని నియంత్రిస్తాయి. వీటిని కూడా రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి.