Chia Seeds : ప్రస్తుత తరుణంలో చాలా మంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరుస్తున్నారు. అందులో భాగంగానే పిండి పదార్థాలను తక్కువగా ప్రోటీన్లను అధికంగా తీసుకుంటున్నారు. అలాగే ఫైబర్ ఉండే ఆహారాలను కూడా ఎక్కువగానే తీసుకుంటున్నారు. అయితే ఫైబర్ విషయానికి వస్తే.. చియా విత్తనాల్లో అత్యధిక ఫైబర్ ఉంటుందని చెప్పవచ్చు. వీటిని 100 గ్రాముల మోతాదులో తింటే ఏకంగా 34 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. కనుక ఫైబర్‌కు వీటిని నెలవుగా చెప్పవచ్చు. మన శరీరంలో ఫైబర్ పోషించే పాత్ర అంతా ఇంతా కాదు. ఇది అధిక బరువును తగ్గిస్తుంది. కొవ్వును కరిగిస్తుంది. అలాగే జీర్ణవ్యవస్థను మొత్తం శుభ్రం చేస్తుంది. కనుక ఫైబర్ ఉండే ఆహారాలను అధికంగా తినాలని చెబుతుంటారు. చియా విత్తనాల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కనుక వీటిని అద్భుతమైన ఆహారంగా పిలుస్తారు. వీటినే మిరాకిల్ ఫుడ్ అని కూడా అంటారు.
చియా విత్తనాలు చాలా చిన్నగా 1 మిల్లీమీటర్ వ్యాసంతో చూసేందుకు అచ్చం సబ్జా గింజలను పోలి ఉంటాయి. వీటిని అమెరికా, యూరప్, జపాన్ వాసులు ఎక్కువగా తింటారు. కానీ ప్రస్తుతం వీటిని మన దేశంలోనూ చాలా మంది తింటున్నారు. ఎందుకంటే చియా విత్తనాలు మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. వీటిని తినడం వల్ల లభించే ఫైబర్ మనకు ఎంతో మేలు చేస్తుంది. అధిక బరువును తగ్గించడంతోపాటు జీర్ణ సమస్యల నుంచి బయట పడేస్తుంది. కనుక చియా విత్తనాలను తరచూ తినాలి.
చియా విత్తనాలను తినడం వల్ల శరీరంలో కొవ్వు చేరదు. ఫలితంగా బరువు నియంత్రణలో ఉంటుంది. అలాగే వీటిని తినడం వల్ల తమ సహజ బరువు కన్నా 12 రెట్లు ఎక్కువగా బరువు పెరుగుతాయి. ఇవి నీటిని శోషించుకుని సబ్జా గింజల మాదిరిగా సైజ్ పెరుగుతాయి. కనుక వీటిని తక్కువగా తిన్నా చాలు.. కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఫలితంగా బరువు తగ్గడం సులభతరం అవుతుంది.
చియా విత్తనాల్లో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. గాలిక్ యాసిడ్, కెఫీక్ యాసిడ్, రోస్‌మరినిక్ యాసిడ్, క్లోరోజెనిక్ యాసిడ్, ఐసోఫ్లేవోన్స్, మైరిసెటిన్, క్వర్‌సెటిన్, కెయింప్‌ఫెరోల్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. డయాబెటిస్, గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. అలాగే వీటిలో విటమిన్ సి, ఇ కూడా అధికంగానే ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
చియా విత్తనాల్లో సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసి వ్యాధులు రాకుండా చూస్తాయి. చియా విత్తనాల్లో మినరల్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా ఒక గ్లాస్ పాలను తాగడం వల్ల లభించే కాల్షియం కన్నా 6 రెట్ల ఎక్కువ కాల్షియం మనకు గుప్పెడు చియా విత్తనాలను తినడం వల్ల లభిస్తుంది. అలాగే పాల కన్నా 11 రెట్ల ఎక్కువ ఫాస్ఫరస్, 4 రెట్లు ఎక్కువ పొటాషియం మనకు చియా విత్తనాల ద్వారా లభిస్తాయి. కనుక చియా విత్తనాలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఇక ఈ విత్తనాల్లో జింక్, ఐరన్, కాపర్ వంటి ఇతర మినరల్స్ కూడా అధికంగానే ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు, 9 రకాల అమైనో యాసిడ్లు ఉంటాయి. ఈ క్రమంలోనే చియా విత్తనాలను తినడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. కనుకనే వీటిని అద్భుతమైన ఆహారంగా పిలుస్తారు.