Cucumber Seeds : వేసవి కాలం రాగానే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేవి.. కీరదోస. ఇవి మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇవి మనకు చలువ చేస్తాయి. కనుకనే ఈ సీజన్‌లో చాలా మంది వీటిని తింటుంటారు. అయితే కీరదోసను తినేవారు చాలా మంది చేసే పొరపాటు ఒకటుంది. అదేమిటంటే.. కీరదోసను కోసే సమయంలో అందులో ఉండే విత్తనాలను పూర్తిగా తీసేస్తుంటారు. వాస్తవానికి ఆ విత్తనాలను అలా తీసేయరాదు. వాటితోనూ మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కీరదోసను విత్తనాలతో సహా తినాల్సిందే. లేదంటే అనేక లాభాలను కోల్పోతారు. కీరదోస విత్తనాల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా వాటిల్లో అమైనో యాసిడ్లు, విటమిన్లు, కెరోటీన్, థయామిన్, రైబో ఫ్లేవిన్, జైలోజ్, ఫ్రక్టోజ్, గ్లైకోసైడ్స్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, పొటాషియం తదితర అనేక పోషకాలు ఉంటాయి.
కీరదోస విత్తనాల్లో ఉండే పోషకాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి మన శరీరంలోని కణాలను రక్షిస్తాయి. కణాలు దెబ్బతినకుండా చూస్తాయి. వాటిని పునర్నిర్మాణం చేస్తాయి. వాటిని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే కీరదోస విత్తనాలు మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఇక కీరదోస విత్తనాలను తినడం వల్ల మనకు కాల్షియం కూడా అధికంగానే లభిస్తుంది. 100 గ్రాముల కీరదోస విత్తనాలను తింటే సుమారుగా 90 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. ఇది ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచుతుంది.
సాధారణంగా మనం పాలు వంటి ఆహారాలను తీసుకుంటే వాటిలో ఉండే కాల్షియాన్ని శరీరం శోషించుకునేందుకు సమయం పడుతుంది. కానీ కీరదోస విత్తనాల్లో ఉండే కాల్షియాన్నిశరీరం బాగా గ్రహిస్తుంది. చాలా త్వరగా దాన్ని శోషించుకుంటుంది. దీంతో కాల్షియం త్వరగా వినియోగం అవుతుంది. ఇక కీరదోస విత్తనాలను తినడం వల్ల నడుము, కాళ్ల నొప్పులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కనుక ఇకపై కీరదోసలను తినేటప్పుడు విత్తనాలను ఎట్టి పరిస్థితిలోనూ తీయకండి. లేదంటే అనేక లాభాలను కోల్పోతారు.