మనకు తినేందుకు అనేక రకాల నట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పిస్తా పప్పు కూడా ఒకటి. పిస్తా పప్పులు మన ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. వీటిల్లో మన శరీరానికి అవసరం అయ్యే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ పప్పుల్లో ఫైబర్, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అధిక బరువును తగ్గించేందుకు, గుండెను, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే పోషకాలు ఈ పప్పుల్లో అధికంగా ఉంటాయి. ఈ క్రమంలోనే నిత్యం గుప్పెడు పిస్తాపప్పులను రోజూ తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పిస్తాపప్పును ఒక గుప్పెడు (సుమారుగా 28 గ్రాములు) మోతాదులో తింటే మనకు 159 క్యాలరీలు లభిస్తాయి. వీటిలో స్వల్ప మోతాదులో పిండి పదార్థాలు ఉంటాయి. అలాగే ఫైబర్, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పొటాషియం, ఫాస్ఫరస్, విటమిన్ బి6, థయామిన్, కాపర్, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. అందువల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది.
పిస్తాపప్పుల్లో లుటీన్, జియాంతిన్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి. క్యాన్సర్లు, గుండె జబ్బులను రాకుండా చూస్తాయి.
వృక్ష సంబంధ పదార్థాల ద్వారా ప్రోటీన్లు కావాలని అనుకునే వారు నిత్యం పిస్తాపప్పును తినవచ్చు. వీటిలో ప్రోటీన్లు అధికంగానే ఉంటాయి. అందువల్ల శరీర నిర్మాణం జరుగుతుంది. కండరాలు దృఢంగా మారుతాయి. శరీరానికి శక్తి లభిస్తుంది.
పిస్తాపప్పులో ఉండే ఫైబర్, ప్రోటీన్లు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. అందువల్ల వీటిని తింటే చాలా సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తీసుకుంటారు. ఫలితంగా అధిక బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. పిస్తాపప్పును నిత్యం గుప్పెడు మోతాదులో 24 వారాల పాటు తింటే నడుం చుట్టుకొలత సుమారుగా 0.6 ఇంచుల వరకు తగ్గిందని సైంటిస్టులు చేపట్టిన ఓ పరిశోధనలో వెల్లడైంది. అందువల్ల ఈ పప్పును తింటే నడుం కూడా తగ్గుతుంది. అధిక బరువు తగ్గుతారు.
మన జీర్ణాశయంలో ఉండే మంచి బాక్టీరియా అనేక పనులు చేస్తుంది. అది మనం తిన్న ఆహారంలో ఉండే ఫైబర్‌ను షార్ట్ – చెయిన్ ఫ్యాటీ యాసిడ్స్‌గా మారుస్తుంది. దీంతో జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. క్యాన్సర్, గుండె జబ్బులు రావు. అయితే పిస్తాపప్పును నిత్యం తినడం వల్ల జీర్ణాశయంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. ముందు తెలిపిన లాభాలు కలుగుతాయి.
పిస్తా పప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం కొలెస్ట్రాల్, బీపీలను తగ్గిస్తాయి. నిత్యం గుప్పెడు మోతాదులో 4 వారాల పాటు పిస్తాపప్పును తిన్న వారిలో 23 శాతం వరకు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలు వెల్లడించాయి. అందువల్ల వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు.
పిస్తాపప్పులో ఎల్-అర్గైనైన్ అనబడే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
నిత్యం రెండు గుప్పెళ్ల మోతాదులో 12 వారాల పాటు పిస్తాపప్పును తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు 20 నుంచి 30 శాతం వరకు తగ్గాయని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో తేలింది. అందువల్ల డయాబెటిస్ ఉన్న వారు వీటిని నిత్యం తింటే షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.