Pumpkin Seeds : సాధారణంగా మనలో చాలా మంది గుమ్మడికాయలను వాడినప్పుడు వాటిలోని గింజలను తీసి పడేస్తూ ఉంటారు. కానీ ఈ గింజలు వివిధ పోషకాల భాండాగారం అని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు. వీటిలో దాదాపు అన్ని రకాల పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. ఇవి సైజులో చిన్నవి అయినప్పటికీ ఆరోగ్యకరమైన ప్రయోజనాలతో నిండి ఉంటాయి. అతి కొద్ది మోతాదులో తీసుకున్నప్పటికీ ఆరోగ్యంపై గొప్ప ప్రభావం చూపడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇక ఈ గుమ్మడి గింజలను మన డైట్ లో భాగం చేసుకోవడం వలన ఇంకా ఎలాంటి లాభాలు ఉంటాయో తెలుసుకుందాం.
గుమ్మడి గింజలలో మెగ్నిషియం పుష్కలంగా ఉంటుంది. ఈ మెగ్నిషియం బ్లడ్ ప్రెషర్ ను తగ్గిస్తుంది. ఇంకా రక్తంలో షుగర్ లెవల్స్ ను అదుపు చేయడంలో, అలాగే గుండె, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో చురుగ్గా పని చేస్తుంది. గుమ్మడి గింజలలో మనకు అవసరమైన ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. దీనితో పాటు 5-హైడ్రాక్సీ ట్రిప్టోఫాన్ అనే ట్రిప్టోఫాన్ కు చెందిన సమ్మేళనం కూడా ఉంటుంది. ఇవి రెండూ డిప్రెషన్ ను తగ్గించే మూలకాలుగా పనిచేస్తాయి. ఇంకా ఈ గింజలలో ఉండే ఫినోలిక్ యాంటీ ఆక్సీడెంట్లు శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను బ్యాలెన్స్ చేయడం వలన రక్తంలోని షుగర్ లెవల్స్ ను కూడా అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.
అంతే కాకుండా గుమ్మడి గింజలలో ఉండే ఫైటోస్టిరోల్స్ జుట్టు పెరుగుదలపై అనుకూల ప్రభావం చూపుతాయి. దాని వలన జుట్టు పెరుగుతుంది. ఇంకా ఈ గింజలలో జింక్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే మెదడు, చర్మం పనితీరును మెరుగు పరుస్తుంది. ముఖ్యంగా పురుషులలో వీర్యకణాల సంఖ్యను పెంచడంతోపాటు ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది.
అయితే ఈ గింజలను తీసుకోవడానికి అనేక రకాల పద్ధతులు ఉన్నాయి. వీటిని వివిధ రకాల స్మూతీలు, పండ్లు లేదా పెరుగుతో కలిపి తీసుకోవచ్చు. ఇంకా సలాడ్లు, సూప్ లు, తృణధాన్యాలతో కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా గుమ్మడి గింజలను మన ఆహారంలో భాగం చేసుకుని పైన చెప్పిన లాభాలను పొందవచ్చు.