Raisins : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో ద్రాక్ష పండ్లు కూడా ఒకటి. ద్రాక్ష పండ్లు మనకు మార్కెట్ లో విరివిరిగా లభిస్తూ ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అలాగే మనకు తెల్ల ద్రాక్ష, నల్ల ద్రాక్ష అనే రెండు రకాల ద్రాక్షలు లభిస్తాయి. చాలా మందికి తెల్ల ద్రాక్షలు మంచివా.. నల్ల ద్రాక్షలు మంచివా.. అన్న సందేహం కలుగుతుంది. తెల్ల ద్రాక్షలు రుచిగా ఉన్నప్పటికి మన ఆరోగ్యానికి నల్ల ద్రాక్షలు మరింత మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా నల్ల ద్రాక్షనే వినియోగిస్తారని నిపుణులు తెలియజేస్తున్నారు. నల్ల ద్రాక్షలో ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇవి మనకు అన్నీ కాలాల్లో లభించవు.
కానీ మనకు మార్కెట్ లో ఎండిన రూపంలో ఉన్న నల్ల ద్రాక్షలు లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల కూడా మనకు చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది. ఈ నల్ల ద్రాక్షను తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో చర్మం ముడతలు పడడం ఒకటి. వయసు తక్కువగా ఉన్నప్పటికి వృద్ధాప్య ఛాయలు ముందే వస్తూ ఉంటాయి. ఇటువంటి సమస్యతో బాధపడే వారు నల్ల ద్రాక్షను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి హానిని కలిగించే ఫ్రీరాడికల్స్ ను నివారిస్తాయి. శరీరంలో ఉండే మలినాలను, వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి. దీంతో చర్మం బిగుతుగా మారడంతో పాటు కాంతివంతంగా తయారవుతుంది. ఎండిన నల్ల ద్రాక్షలను నీటితో నానబెట్టుకుని తినడం అలాగే ఆ నీటిని తాగడం వంటివి చేయడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరిచి జుట్టును ధృడంగా, ఆరోగ్యంగా, నల్లగా ఉంచడంలో కూడా నల్ల ద్రాక్ష మనకు సహాయపడుతుంది. నల్ల ద్రాక్షలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మనం తీసుకునే ఆహారాల్లో ఉండే ఐరన్ ను శరీరం గ్రహించేలా చేయడంలో సహాయపడుతుంది.
అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి చాలా మంది అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బులు, ఊబకాయం, బ్రెయిన్ స్ట్రోక్ వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి మనం అనారోగ్య సమస్యల బారిన పడకుండా చేయడంలో ఎండిన నల్ల ద్రాక్ష మనకు సహాయపడుతుంది. దీనిలో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ ను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ నల్ల ద్రాక్షలను ఎవరైనా ఆహారంగా తీసుకోవచ్చు. వీటిని మనం ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.