Soya Tofu : చాలా త‌క్కువ ఖ‌ర్చులోనే శ‌రీరానికి ప్రోటీన్లు అందాలంటే.. వీటిని తీసుకోవాలి..

Soya Tofu : మ‌న శ‌రీరంలో స్థూల పోష‌కాహారంలో అతి ముఖ్య‌మైన పాత్ర‌ను పోషించేది ప్రోటీన్. ప్రోటీన్ ల వ‌ల్ల మ‌న‌కు అనేక ఉప‌యోగాలు ఉన్నాయి. మ‌న శరీరానికి ఒక కిలోకి ఒక గ్రాము చొప్పున ప్రోటీన్ అవ‌స‌ర‌మ‌వుతుంది. వ్యాయామాలు, శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గా చేసే వారికి ఒక కిలోకి 1.6 గ్రాముల మోతాదులో ప్రోటీన్ అవ‌స‌ర‌మ‌వుతుంది. ఇక పిల్ల‌ల‌కు ఒక కిలోకి రెండు గ్రాముల చొప్పున ప్రోటీన్ అవ‌స‌ర‌మ‌వుతుంది. కానీ మ‌న దేశంలో 90 శాతం మంది ప్రోటీన్ లోపంతో బాధ‌ప‌డుతున్నారు. ప్రోటీన్ లోపించ‌డం వ‌ల్ల శ‌రీరంలో హార్మోన్లు స‌రిగ్గా ఉత్ప‌త్తి కావు. ఎంజైమ్స్, వ్యాధి నిరోధ‌క క‌ణాలు, ప్లేట్ లెట్స్ కూడా స‌రిగ్గా ఉత్ప‌త్తి కావు. అలాగే ప్రోటీన్ లోపించ‌డం వ‌ల్ల పిల్లల్లో ఎదుగుద‌ల లోపిస్తుంది. ప్రోటీన్లు లోపించ‌డం వ‌ల్ల స్త్రీలల్లో నెల‌స‌రి స‌మ‌స్య‌లు, సంతాన లేమి స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నమ‌వుతాయి. అలాగే జుట్టు రాల‌డం, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త వంటి స‌మ‌స్య‌ల బారిన కూడా ప‌డాల్సి వ‌స్తుంది.

ప్రోటీన్ లోపించ‌డం వ‌ల్ల చ‌నిపోయిన క‌ణాల స్థానంలో కొత్త క‌ణాలు కూడా త్వ‌ర‌గా త‌యారవ్వ‌వు. చాలా మంది పాలు, చేప‌లు, మాంసం వంటి వాటిలోనే ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయ‌ని వాటినే తీసుకోవాల‌ని అనుకుంటూ ఉంటారు. కానీ అవి అన్నీ కూడా అధిక ధ‌ర‌ల‌తో కూడుకున్న‌వి. వీటిని అంద‌రూ కొనుగోలు చేసి ఆహారంగా తీసుకోలేరు. త‌క్కువ ద‌ర‌లో ఎక్కువ ప్రోటీన్ల‌ను అందించే ఆహారాలు కూడా ఉంటాయి. అలాంటి ఆహారాల్లో సోయా టోఫు ఒక‌టి. ప్రోటీన్ల లోపాన్ని అధిగ‌మించి మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన‌న్ని ప్రోటీన్ల‌ను త‌క్కువ ధ‌ర‌లో అందించే ఆహారాల్లో సోయా టోఫు మొద‌టి స్థానంలో ఉంటుంది. 100 గ్రాముల సోయా టోఫులో 54 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. గ‌ర్భిణీ స్త్రీలు, బాలింత‌లు, ఆట‌లు ఆడే వారు, వ్యాయామాలు చేసేవారికి 2 గ్రాముల కంటే ఎక్కువ ప్రోటీన్ అవ‌స‌ర‌మ‌వుతుంది. ఇలాంటి వారు సోయా టోఫును వారానికి రెండు నుండి మూడు సార్లు తీసుకోవ‌డం వ‌ల్ల ప్రోటీన్ లోపం నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

Soya Tofu gives protein at very low cost
Soya Tofu

ఈ సోయా టోఫు మ‌న‌కు సూప‌ర్ మార్కెట్ ల‌లో, షాపుల్లో విరివిరిగా ల‌భ్య‌మ‌వుతుంది. ఈ సోయా టోఫును మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. సోయా గింజ‌ల‌ను 12 నుండి 13 గంట‌ల పాటు బాగా నాన‌బెట్టాలి. త‌రువాత వీటిపై ఉండే పొట్టు పోయేలా చేత్తో బాగా న‌ల‌పాలి. త‌రువాత ఈ గింజ‌ల‌ను జార్ లోకి తీసుకుని కొద్దిగా నీటిని పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని వ‌డ‌క‌ట్ట‌గా వ‌చ్చిన సోయా పాల‌ను ఒక గిన్నెలోకి తీసుకుని వేడి చేయాలి. సోయా పాలు చ‌క్క‌గా కాగిన త‌రువాత అందులో నిమ్మ‌ర‌సం వేయాలి. నిమ్మ‌ర‌సం వేయ‌డం వ‌ల్ల పాలు విరిగిపోతాయి. త‌రువాత ఈ పాల విరుగుడును ఒక వ‌స్త్రంలోకి తీసుకుని నీరంతా పోయేలా పిండాలి. త‌రువాత మూట క‌ట్టి దానిపై బ‌రువును ఉంచాలి. నీరంతా పోయి గ‌ట్టి ప‌డిన త‌రువాత టోఫును ఫ్రిజ్ లో ఉంచాలి. ఇలా చేయ‌డం వల్ల టోఫు గ‌ట్టిప‌డుతుంది.

ఇలా చేయ‌డం వ‌ల్ల సోయా టోఫు త‌యార‌వుతుంది. సోయా గింజ‌ల‌ను తీసుకుని వాటితో ఇలా టోఫును త‌యారు చేసుకుని తిన‌వచ్చు. సాధార‌ణ పాల‌తో త‌యారు చేసిన ప‌న్నీర్ ను ఏ విధంగా వండుకుని తింటామో ఈ సోయా టోఫుతో కూడా వంట‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. 100 గ్రాముల మేక మాంసంలో 21 గ్రాములు, 100 గ్రాముల చికెన్ లో 25 గ్రాములు, చేప‌ల్లో 10 నుండి 18 గ్రాముల వ‌ర‌కు ప్రోటీన్ ఉంటుంది. ఈ సోయా టోఫును తీసుకోవ‌డం వ‌ల్ల స్త్రీల‌ల్లో ఈస్ట్రోజ‌న్ హార్మోన్ కూడా పెరుగుతుంది. ప్రోటీన్ లోపంతో బాధ‌పడే వారు ఈ సోయా టోఫును తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts