అనగనగా… ఒక సారి భోజరాజుకు వింత కోరిక కలిగింది. నేను మరణించిన తర్వాత కాళిదాసు తన గురించి ఏమి చెప్తాడు? అని. వెంటనే కాళిదాసును పిలిపించి తన కోరిక చెప్పాడు. దానికి కాళిదాసు.. మీ కోరిక పిచ్చిగానూ, అమంగళకరము గానూ ఉంది. నేను తీర్చలేను క్షమించండి అన్నాడు. రాజాజ్ఞను ధిక్కరించిన వారికి దేశ బహిష్కారమే శిక్ష అన్నాడు రాజు అలాగైనా భయపడి చెప్తాడేమో నని. కానీ, కాళిదాసు మాత్రం విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని చెప్పి ధారా నగరం విడిచి వెళ్ళిపోయాడు. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించని రాజు దిగులు పడిపోయాడు. కాళిదాసు లేకుంటే ఆయనకు ఒక్క రోజు కూడా గడవదు. ఆయన కెవరో చెప్పారు…కాళిదాసు ఏకశిలా నగరంలో ఉన్నాడని. భోజరాజు గడ్డాలూ మీసాలూ పెట్టుకొని యోగి వేషంలో కాళిదాసును వెతకడానికి ఏకశిలా నగరానికి వెళ్ళాడు.
అక్కడ కాళిదాసు ఆయనకు ఎదురు పడ్డాడు. భోజరాజు ఆయనను చూసి మహా కవీ అభివాదాలు, నేను ధారా నగరం నుండి వస్తున్నాను.. అన్నాడు. అలాగా.. అయితే భోజరాజు ఎలా ఉన్నారు? అని అడిగాడు కాళిదాసు. అప్పుడు యోగి వేషంలో ఉన్న భోజరాజు… విచారంగా _ ఇంకెక్కడి భోజరాజు? కాళిదాసు వెళ్లిపోగానే ఆయన ఆ దిగులుతో మరణించారు అన్నాడు. కాళిదాసు అదిరి పడ్డాడు. ఆయనకు భోజరాజుతో గడిపిన రోజులు గుర్తు కొచ్చాయి. అప్రయత్నంగా ఆయన నోటివెంట శ్లోకం వచ్చింది.
ఆద్య ధారా, నిరాలంబా సరస్వతీ.. పండితా ఖండితా సర్వే భోజరాజే దివంగతే.. అర్థము.. ఈ రోజు ధారా నగరం నిరాధారమై పోయింది. వాగ్దేవికి ఆలంబన పోయింది. భోజరాజు దివంగతుడు కావటంతో పండితులందరికీ చావు దెబ్బ తగిలింది.. అన్నాడు. కానీ, ఆయన వాక్శుద్ధి ప్రభావంతో ఆ యోగి అకస్మాత్తుగా కూలి చని పోయాడు. నిదానంగా పరికించి చూసి.. ఆ యోగిని భోజరాజుగా గుర్తించి కాళిదాసు రోదించాడు. వెంటనే కర్తవ్యం స్ఫురించి భువనేశ్వరీ దేవిని ప్రార్థించి తన శ్లోకాన్ని మార్చి చదివాడు. అద్యదారా సదా ధారా, సదాలంబా సరస్వతీ.. పండితా మండితా సర్వే, భోజరాజే భువంగతే!.. అర్థము.. ఈ రోజు ధారా నగరానికీ, సరస్వతీ దేవికీ చక్కని ఆలంబన దొరికింది. భోజరాజు భూలోకంలో అవతరించగానే పండితులందరూ చక్కగా సత్కరించ బడ్డారు.
ఆ శ్లోకం వినగానే భోజరాజు సజీవుడై లేచి కూర్చున్నాడు. రాజూ, కవిరాజూ గాఢంగా కౌగలించుకున్నారు. ధారా నగరానికి తిరిగి వెళ్లి పోయారు. కాళిదాసు వాక్శుద్ధి అలాంటిది మరి. అందుకనే మొదట రాజు తాను చనిపోయిన తరువాత ఏం జరుగుతుందని అడిగినా కాళిదాసు చెప్పలేదు.