నోరూరించే కేక్… దానిపై ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన వివిధ రకాల ఫ్రూట్స్… కేక్‌పై రాసిన క్రీం… వీటికి తోడు వెలిగించిన క్యాండిల్స్… ఇవన్నీ బర్త్‌డే వేడుకల్లో మనకు కనిపించే దృశ్యాలు. బర్త్ డే ఎవరు జరుపుకున్నా, ఎలా వేడుక చేసుకున్నా ముందుగా కేక్ కట్ చేయడం అందరికీ అలవాటు. పిల్లలైతే బర్త్ డే రోజున కేక్ కట్ చేసేందుకు ఎంతగానో ఆసక్తిని ప్రదర్శిస్తారు. అయితే ఎవరు కేక్ కట్ చేసినా ముందుగా క్యాండిల్స్ ఆర్పుతారు కదా… మరి అసలు ఎలా ఎందుకు చేస్తారో తెలుసా..? అలా క్యాండిల్స్ ఊదడం ఎప్పుడు స్టార్ట్ అయిందో, దాని వెనుక ఉన్న కారణాలు ఏమిటో మీకు తెలుసా..? వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
బర్త్ డే రోజున కేక్ కట్ చేసే ముందు క్యాండిల్స్ ఊదడం ఇప్పుడు ప్రారంభమైన ప్రక్రియ కాదు. అది ఎప్పుడో 1700వ సంవత్సరంలోనే ప్రారంభమైనట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అయితే 15వ శతాబ్దంలోనే జర్మన్లు పుట్టిన రోజు వేడుకలకు కేక్‌లు తయారు చేసి తినడం మొదలు పెట్టగా వాటిపై క్యాండిల్స్ వెలిగించి ఊదడం మాత్రం 1700వ సంవత్సరంలో ప్రారంభమైంది. అది కూడా జర్మనీలోనే ముందుగా ప్రారంభమైంది. 1700వ సంవత్సరంలో కిండర్‌ఫెస్ట్ అనే ఓ కార్యక్రమంలో పిల్లలకు బర్త్ డే వేడుకలు నిర్వహించారట. అప్పుడు కేక్‌లపై క్యాండిల్స్ ఉంచి వాటిని ఊదుతూ వేడుకలు నిర్వహించారట. వారు అప్పుడు అలా క్యాండిల్స్ ఎందుకు పెట్టారంటే… లైట్ (కాంతి) అంటే లైఫ్ (జీవితం), డార్క్ (చీకటి) అంటే డెత్ (మరణం) అనే ఉద్దేశంతో లైట్‌ను వెలిగిస్తే ఆ వ్యక్తి ఇంకా ఎక్కువ ఏళ్లు జీవిస్తాడనే నమ్మకంతో వారు కేక్‌లపై క్యాండిల్స్‌ను వెలిగించేవారు. ఈ క్రమంలో 1746లో కౌంట్ లుడ్విగ్ వాన్ జిన్‌జిన్‌డార్ఫ్ అనే ఓ జర్మన్ వ్యక్తి పెద్ద కేక్‌పై క్యాండిల్స్‌ను వెలిగించి తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడట. దీంతో మెల్ల మెల్లగా ఈ విధానం అన్ని దేశాలకు పాకిందట.
బర్త్ డే కేక్‌పై క్యాండిల్స్‌ను వెలిగించడం వెనుక గ్రీస్ వాసులకు చెందిన మరో విశ్వాసం ప్రచారంలో ఉంది. వారు అలా క్యాండిల్స్‌ను వెలిగిస్తే తమ దేవత ఆర్టెమిస్ ఆశీర్వచనాలు దక్కుతాయని వారి నమ్మకం. అందుకే వారు బర్త్ డే కేక్‌లపై క్యాండిల్స్‌ను వెలిగిస్తారు. అయితే ఇలా చేయడం వల్ల జన్మదినం జరుపుకునే వ్యక్తులకు దుష్ట శక్తుల నుంచి రక్షణ లభిస్తుందని నమ్మేవారు కూడా కొందరు ఉన్నారు. సాధారణంగా ఏ వ్యక్తికైనా అతని బర్త్ డే రోజున అతనిపై దుష్ట శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందట. దీంతో ఆ రోజున క్యాండిల్స్ వెలిగిస్తే ఆ శక్తుల ప్రభావం తగ్గుతుందని కొందరు నమ్ముతారు. ఇవీ… బర్త్ డే కేక్‌పై క్యాండిల్స్ వెలిగించడం వెనక ఉన్న కొన్ని కారణాలు… ఇంకా మనకు తెలియని రీజన్స్ ఎన్నో ప్రచారంలో ఉన్నాయని కొందరు చరిత్రకారులు విశ్వసిస్తున్నారు.