మీరు ఎప్పుడైనా విమానం ఎక్కారా? ఎక్కలేదా? అయినా సరే. విమానం ఎక్కుతున్న వారిని ఎప్పుడైనా గమనించారా? లేదా? అయితే ఓ సారి పరీక్షగా చూడండి. ఇంతకీ ప్రయాణికులు విమానం ఎక్కడంలో విశేషం ఏముందీ? అనేగా మీరు అడగబోయేది. ఆ… అవునుండీ! ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా దాని గురించే. అయితే ఆ విశేషమేమిటో తెలుసుకుందామా! సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా ప్రయాణికులు విమానం ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు దాని ఎడమ భాగం నుంచే మెట్లు ఎక్కి లోపలికి వెళతారు. అయితే ఎడమ వైపు నుంచే ప్రయాణికులను విమానం ఎక్కేందుకు, దిగేందుకు ఎందుకు అనుమతిస్తారు? అసలు కుడి వైపు ప్రయాణికులను ఎందుకు అనుమతించరు? ఈ విషయం గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? లేదా? అయితే ఇలా ఎందుకు చేస్తారో ఇప్పుడు చూద్దాం.
విమానాలకు ఎడమ వైపు నుంచే ప్రయాణికులను ఎక్కించడం, దిగించడం వెనుక పలు రకాల రీజన్లు ఉన్నాయి. అందులో మొదటిది విమానం డిజైన్. అవును, డిజైనే. ఆ డిజైన్‌ను షిప్‌ల నుంచే తీసుకున్నట్టు కొందరు చెబుతున్నారు. సాధారణంగా ఓడలను పోర్టులో వాటి ఎడమ వైపు నిలిపి ఉంచుతారు. దాంట్లోకి ఎవరైనా వెళ్లినా, వచ్చినా ఆ వైపు నుంచే రావడం, పోవడం చేస్తారు. కుడి వైపుకు చుక్కాని ఉంటుంది కాబట్టి అది పోర్టుకు తాకితే ఓడ మునిగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఓడలను వాటి ఎడమ వైపునే పోర్టుల్లో ఆపుతారు. ఈ కారణంగానే ఓడల డిజైన్‌ను బట్టే విమానం డిజైన్ కూడా అదే విధంగా చేశారని, అందుకే దాని ఎడమ వైపు నుంచే ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని పలువురు చెబుతున్నారు.
పురాతన కాలంలో దాదాపు అధిక శాతం మంది రాజులు, సైనికులు కుడి చేతి వాటం వారు కావడంతో వారు తమ ఎడమ వైపు ఒరలో కత్తిని పెట్టుకునేవారు. దీంతో వారు గుర్రంపైకి కూడా దాని ఎడమ వైపు నుంచే ఎక్కాల్సి వచ్చేది. లేదంటే ఒరలో ఉన్న కత్తి వల్ల ఇబ్బంది కలుగుతుంది. దీన్ని అనుసరించే విమానం ఎక్కి, దిగే డిజైన్‌ను కూడా చేశారని పలువురు పేర్కొంటున్నారు.
పైన చెప్పినవి అలా ఉంచితే సాధారణంగా ఓ విమానానికి ఉండే మెయిన్ బ్యాటరీ, అదనపు బ్యాటరీ పవర్ సిస్టమ్‌లతో పాటు విమానంలోకి కార్గోను, ఆహారాన్ని, ఇతర వస్తువులను లోడ్ చేసేందుకు ఉపయోగపడే డోర్స్, ఇంధనం ట్యాంకులు, ఎయిర్ బ్రిడ్జిలకు కనెక్ట్ అయ్యే డోర్స్ తదితరాలన్నీ కుడి వైపుకే ఉంటాయి. ఇదే వైపుకు ప్రయాణికులను కూడా రాకపోకలకు అనుమతిస్తే ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి వారిని కేవలం ఎడమ వైపుకే విమానం ఎక్కేందుకు, దిగేందుకు అనుమతిస్తారు. అసలైన పాయింట్ అదన్నమాట! ఇప్పటికైనా తెలిసిందా? విమానంలోకి ప్రయాణికులు వెళ్లడం, రావడం ఎడమ వైపు నుంచే ఎందుకు చేస్తారో!