Aloe Vera : ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో కలబంద కూడా ఒకటి. ఇది మనందరికీ తెలుసు. దీనిని చాలా మంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. మనకు వచ్చే అనేక రోగాలను నయం చేయడంలో కలబంద ఔషధంగా పని చేస్తుందని మనందరికీ తెలుసు. కలబంద గొప్పతనాన్ని తెలుసుకుని ఇతర దేశాలలో కూడా దీనిని ఔషధంగా ఉపయోగిస్తున్నారు. కలబంద మొక్క చాలా సులువుగా పెరుగుతుంది. ఎటువంటి రసాయనాలను వాడకపోయినా కూడా కలబంద ఏపుగా పెరుగుతుంది. కలబంద సౌందర్య సాధనంగా కూడా పని చేస్తుంది. మొటిమలను, మచ్చలను, వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కలబంద మొక్క ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దీనిని సంస్కృతంలో కూమారి అనీ, హిందీలో గీక్వర్ అని పిలుస్తూ ఉంటారు. ఈ మొక్క చూడడానికి చాలా అందంగా ఉంటుంది. దీని ఆకులు పొడవుగా, చుట్టూ సన్నని ముళ్లను కలిగి ఉంటాయి. కలబందను కోసినప్పుడు దాని నుండి తెల్లని ద్రవం కారుతుంది. దీనిని సేకరించి ఎండలో పెడితే నల్లగా మారుతుంది. దీనినే ముసాంబరం అంటారు. ఈ ముసాంబరాన్ని నిల్వ చేసుకుని ఔషధంగా వాడుకోవచ్చు. కలబందను చిన్న ముక్కలుగా కోసి వాటిపై పసుపును చల్లి కళ్ల కలక వచ్చిన వారి బొటన వేలు కింద ఉంచి కట్టుగా కట్టాలి. ఇలా చేయడం వల్ల కళ్లకలక తగ్గుతుంది. కలబందను కోయగా వచ్చిన గుజ్జును వస్త్రంలో వేసి మూడు లేదా నాలుగు చుక్కల మోతాదులో చెవిలో పిండితే ఆశ్చర్యకరంగా కంటి నొప్పి తగ్గుతుంది.

కలబంద రసం 30 గ్రా.లు, శొంఠి పొడి మూడు చిటికెల మోతాదులో తీసుకుని వాటిని కలిపి తీసుకోవడం వల్ల వెక్కిళ్లు తగ్గుతాయి. కలబంద రసం, నెయ్యిని సమపాళ్లలో కలిపి ఒక గిన్నెలో పోసి దానిని కామెర్ల వ్యాధి వచ్చిన వారి ముక్కు వద్ద ఉంచి మాటిమాటికీ వాసన చూపించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కలబంద ఆకులను పొడుగ్గా మధ్యలోకి చీల్చి ఆ గుజ్జుపై సైంధవ లవణాన్ని కలిపి కుక్క కరిచిన చోట ఉంచి కట్టుగా కట్టాలి. ఇలా రోజుకు ఒకసారి కట్టును మారుస్తూ ఉండాలి. ఈ విధంగా నాలుగు నుండి ఐదు రోజుల పాటు చేయడం వల్ల కుక్క విషం హరించుకుపోతుంది. కలబంద గుజ్జు 5 గ్రా., పిప్ప సత్తును మూడు చిటికెల మోతాదులో తీసుకుని కలిపి భోజనానికి అరగంట ముందు తీసుకుంటూ ఉండడం వల్ల మధుమేహం, అతి మూత్ర వ్యాధి నివారించబడతాయి.
కలబంద గుజ్జు ఒక చెంచా, నెయ్యి ఒక చెంచా, కరక్కాయ పొడి మూడు చిటికెలు, సైంధవ లవణం మూడు చిటికెల మోతాదులో తీసుకుని వీటన్నింటినీ కలిపి భోజనానికి అర గంట ముందు తీసుకుంటూ ఉంటే స్త్రీలలో నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి తగ్గి ఇక ముందు రాకుండా ఉంటుంది. కలబంద ఆకును ఒకవైపు తొలగించి ఆ గుజ్జుపై 1 గ్రాము ఉప్పును, 2గ్రాముల పసుపును చల్లి గడ్డలపై కట్టుగా కట్టడం వల్ల గడ్డలు త్వరగా మానుతాయి. కలబంద గుజ్జు, మెంతిపొడిని కలిపి రాత్రి పడుకునే ముందు నారి కురుపులపై ఉంచి కట్టు కట్టడం వల్ల నారి కురుపులలో ఉండే పురుగులు బయటకు వస్తాయి. కలబంద గుజ్జు ఒక చెంచా, ఒక గ్రాము ఉప్పు, ఒక గ్రాము మిరియాల పొడి, ఒక చెంచా నెయ్యిని కలిపి రోజుకు రెండు పూటలా నారి కురుపులు ఉన్న వారు ఔషధంగా తీసుకోవడం వల్ల అతి త్వరగా ఆ కురుపులు తగ్గుతాయి.
చిల్ల గింజలను, ఎండుప్ప గింజలను కలబంద రసంలో వేసి పదిరోజుల పాటు నానబెట్టి తీసి ఎండబెట్టి బాగా తుడిచి నిల్వ చేసుకోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు ఈ గింజలను అరగదీసి ఆ గంధాన్ని కంట్లో పెట్టుకోవడం వల్ల కంటి పొరలు తగ్గి కంటి చూపు మెరుగుపడుతుంది. కలబంద వేరును కడిగి ఎండబెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని 5 గ్రాముల మోతాదులో ఒక కప్పు ఆవు పాలలో వేసి అందులో కండచక్కెరను కూడా వేసి కలిపి తాగడం వల్ల స్త్రీ, పురుషులిద్దరూ బలంగా తయారవుతారు. ఈ విధంగా కలబందను ఉపయోగించి మనకు వచ్చే అనేక రోగాలను నయం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.