Chilli Plant : మనం ప్రతి రోజూ వంటల తయారీలో పచ్చి మిరపకాయలను ఉపయోగిస్తూ ఉంటాం. వంటల తయారీలో, చట్నీల తయారీలో, రోటి పచ్చళ్ల తయారీలో వీటిని మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. కొందరు పచ్చి మిరపకాయలను నేరుగా కూడా తింటూ ఉంటారు. పచ్చి మిరపకాయలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని మనందరికీ తెలుసు. అయితే కేవలం మిరపకాయలే కాకుండా మిరప చెట్టు ఆకులు కూడా మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్ ను, మినరల్స్ ను కలిగి ఉంటాయి. మిరప చెట్టు ఆకుల వల్ల కూడా మనం అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు. మిరపచెట్టు ఆకులు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మిరప ఆకులు చేదు రుచిని కలిగి ఉంటాయి. వీటిల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి లతోపాటు ఐరన్, కాల్షియం, పొటాషియం వంటి మినరల్స్ కూడా ఉంటాయి. ఆర్థరైటిస్ తో బాధపడే వారికి ఈ మిరప ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆర్థరైటిస్ కు చేసే చిక్సితలో మిరప ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా వైరస్, బాక్టీరియాల వల్ల కలిగే ఇన్ ఫెక్షన్ లను నయం చేయడంలో కూడా మిరప ఆకులు సహాయపడతాయి. శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను తొలగించడంలో, చర్మ సంబంధమైన అనారోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా మిరప ఆకులు మనకు ఎంతో దోహదపడతాయి. మిరప ఆకులల్లో కొవ్వులు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. రోజూ ఉదయం నాలుగు మిరప ఆకులను ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించి , వడకట్టుకుని తాగడం వల్ల త్వరగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ నీటిని భోజనం అయ్యాక తాగడం వల్ల జీర్ణాశయ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.

శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను నిర్మూలించడంలో ఈ మిరప ఆకులు ఎంతో ఉపయోగపడతాయి. తలనొప్పిగా ఉన్నప్పుడు మిరప ఆకులను పేస్ట్ గా చేసి నుదుటికి రాసుకోవడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. ఈ ఆకులు యాంటీ సెప్టిక్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. మిరప ఆకులను పేస్ట్ గా చేసి గాయాలపై రాయడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. ముఖంపై మొటిమలతో బాధ పడే వారు మిరప ఆకులను పేస్ట్ గా చేసి మొటిమలపై రాసి ఆరిన తరువాత చల్లటి నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల మొటిమలు రాకుండా ఉంటాయి.
మిరప ఆకులను నీటిలో ఉడికించి ఆ నీటితో నోటిని శుభ్రం చేసుకోవడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. దోమలు, పురుగులు కుట్టినప్పుడు చర్మం పై దద్దుర్లు వస్తాయి. ఆ దద్దుర్లపై మిరప ఆకుల పేస్ట్ ను రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా కేవలం మిరపకాయలే కాకుండా మిరప ఆకులు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎటువంటి రసాయనాలు, క్రిమిసంహారాలు వాడని మిరప ఆకులను మాత్రమే ఔషధంగా ఉపయోగించాలని వారు చెబుతున్నారు.