Bodathara Mokka : మనకు చుట్టూ ఉండే ఔషధ మొక్కలలో బోడతర మొక్క ఒకటి. వీటిని చాలా మంది చూసే ఉంటారు. గ్రామాలలో, పంట పొలాల దగ్గర, అడవి ప్రాంతాలలో ఇవి ఎక్కువగా ఉంటాయి. నీరు ఎక్కవగా ఉండే ప్రాంతాలలో కూడా ఈ బోడతర మొక్కలు ఉంటాయి. వీటిలో తెలుపు, ఎరుపు, పసుపు రంగుల్లో పూలు పూసే మూడు రకాల బోడతర మొక్కలు ఉంటాయి. కానీ మనకు ఎక్కువగా ఎరుపు రంగు పూలు పూసే బోడతర మొక్కలే కనిపిస్తాయి. ఈ మొక్కలు కూడా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. కానీ ఈ మొక్కల గురించి తెలియక చాలా మంది వీటిని పిచ్చి మొక్కలుగా భావిస్తూ ఉంటారు. ఆయుర్వేదంలో బోడతర మొక్కలను ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్కలను ఉపయోగించి ఏయే వ్యాధులను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
కొన్ని ప్రాంతాలలో ఈ బోడతర మొక్కల కాయలను పరగడుపున తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయని వారు నమ్ముతారు. నోటి దుర్వాసనతో బాధపడే వారు ఈ మొక్క ఆకులను, నేరేడు ఆకులు, తులసి ఆకులను, జాజి ఆకులను సమపాళ్లల్లో తీసుకుని దంచి రసాన్ని తీసి ఆ రసానికి సమానంగా నువ్వుల నూనెను కలిపి చిన్న మంటపై నూనె మిగిలే వరకు మరిగించి నిల్వ చేసుకోవాలి. రోజూ ఉదయాన్నే దంతాలను శుభ్రం చేసిన తరువాత ఈ నూనెను నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మి వేయాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల క్రమంగా నోటి దుర్వాసన తగ్గుతుంది.
మూర్ఛ వ్యాధిని నయం చేయడంలో కూడా ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎండిన బోడతర మొక్క పువ్వులను తీసుకుని పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని పావు టీ స్పూన్ మోతాదులో తీసుకుని దానికి ఒక గ్రాము వస కొమ్ముల పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు పూటలా ఒక కప్పు నీటిలో కలుపుకుని తాగాలి. ఇలా చేస్తూ ఉంటే మూర్ఛ వ్యాధి తగ్గుతుంది. ఈ వ్యాధితో బాధపడే చిన్న పిల్లల మెడలో ఈ మొక్క ఎండిన పువ్వుల దండను వేయడం వల్ల మూర్ఛ వ్యాధి తగ్గుతుంది.
రక్త మొలల సమస్యతో బాధపడే వారు చెట్టు మీద ఎండిన పది బోడతర మొక్క పువ్వులను సేకరించి వాటిని కచ్చా పచ్చాగా దంచి రెండు గ్లాసుల నీటిలో వేసి ఒక గ్లాసు అయ్యే వరకు మరిగించి వడకట్టాలి. ఈ కషాయాన్ని గోరు వెచ్చగా రోజూ పరగడుపునే తాగుతూ ఉండడం వల్ల రక్త మొలల సమస్య నుండి బయట పడవచ్చు. ఎండిన బోడతర మొక్క పువ్వుల పొడిని, ఆవు నెయ్యిలో దోరగా వేయించిన శొంఠి పొడిని సమపాళ్లలో తీసుకుని ఈ రెండింటినీ కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజూ రెండు పూటలా భోజనానికి అర గంట ముందు పావు టీ స్పూన్ మోతాదులో తీసుకోవడం వల్ల క్రమంగా కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఈ విధంగా బోడతర మొక్కను ఉపయోగించి మనకు వచ్చే పలు రకాల అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.