Brahmadandi : రోడ్లకు ఇరు వైపులా, పొలాల దగ్గర, చేలలో, ఖాళీ ప్రదేశాల్లో ఎక్కువగా పెరిగే మొక్కలల్లో బ్రహ్మదండి మొక్క కూడా ఒకటి. దీనిని సంస్కృతంలో బ్రహ్మదండి, కట్ట పత్ర ఫల అని పిలుస్తారు. ఈ మొక్కల్లో ప్రతి భాగం ముళ్లులను కలిగి ఉంటుంది. ఈ చెట్టు పూలు పసుపు రంగులో ఉంటాయి. బ్రహ్మదండి మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుందని దీనిని ఔషధంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చెట్టు వేడి చేసే స్వభావం కలిగి ఉంటుంది. కనుక దీనిని సరైన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. వాత, కఫ, పిత దోషాలను తొలగించడంలో ఈ మొక్క అద్భుతంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పక్షవాతం, పార్శ్వపు తలనొప్పి, కఫ సమస్యలు, శరీరంలో నొప్పులను తగ్గించడంలో, మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో, అజీర్తి, అరుగుదల తక్కువగా ఉండడం, మూత్రం బొట్లు బొట్లుగా పడడం, మూత్రంలో మంట, వరిబీజం వంటి సమస్యలను తగ్గించడంలో బ్రహ్మదండి మొక్క చక్కగా పని చేస్తుంది. పురుషుల్లో వచ్చే లైంగిక సమస్యలను తగ్గించడంలో కూడా బ్రహ్మదండి మొక్క అద్భుతంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్క సమూల కషాయాన్ని రోజూ 2 నుండి 4 స్పూన్ల మోతాదులో తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. అన్ని రకాల మేహ సమస్యలు తగ్గుతాయి. అలాగే బ్రహ్మదండి మొక్కతో క్షారాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల స్త్రీలల్లో వచ్చే తెల్లబట్ట సమస్య తగ్గుతుంది.
బ్రహ్మదండి మొక్కను సమూలంగా సేకరించి కాల్చి బూడిద చేసుకోవాలి. ఈ బూడిదను కుండలో వేసి కుండ నిండుగా నీటిని పోసి బాగా కలపాలి. తరువాత దీనిని మూడు రోజుల పాటు కదిలించకుండా ఉంచాలి. తరువాత ఈ కుండలో పైన పేరుకున్న నీటిని తీసుకుని వేరే పాత్రలో పోసి నీరంతా పోయే వరకు మరిగించాలి. నీరు ఆవిరైపోగా మిగిలిన ఉప్పు వంటి పదార్థాన్ని సేకరించి నిల్వ చేసుకోవాలి. దీనినే బ్రహ్మదండి ఉప్పు లేదా బ్రహ్మదండి క్షారం అని అంటారు. ఈ క్షారాన్ని ఒక స్పూన్ మోతాదులో ఆవు నెయ్యితో కలిపి రోజూ రెండు పూటలా తీసుకోవడం వల్ల స్త్రీలల్లో వచ్చే తెల్లబట్ట సమస్య తగ్గుతుంది.
పురుషుల్లో వచ్చే వరిబీజం సమస్యను తగ్గించడంలో బ్రహ్మదండి మొక్క ఎంతగానో సహాయపడుతుంది. ఈ మొక్క పూలను సేకరించి మెత్తగా దంచాలి. తరువాత ఈ మిశ్రమాన్ని బట్టలో వేసి వరిబీజం సమస్య తలెత్తిన వైపు వృషణంపై రాస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వరిబీజం సమస్య తగ్గుతుంది. అలాగే ఈ మొక్క వేర్లను సేకరించి ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని రెండు స్పూన్ల మోతాదులో ఆవు పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల పురుషుల్లో వచ్చే అన్ని రకాల లైంగిక సమస్యలు తగ్గుతాయి. ఈ విధంగా బ్రహ్మదండి మొక్కను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి చాలా సులభంగా బయటపడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.