Gadida Gadapa : మనకు విరివిరిగా లభించే ఔషధ మొక్కల్లో గాడిదగడపాకు మొక్క కూడా ఒకటి. ఈమొక్కను మనలో చాలామంది చూసే ఉంటారు. కానీ దీనిలో కూడా ఔషధ గుణాలు ఉంటాయని తెలియక ఒక పిచ్చి మొక్కగా భావించి ఉంటారు. పొలాల్లో, నల్ల రేగడి భూముల్లో, ఖాళీ ప్రదేశాల్లో ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుంది. చాలా మంది దీనిని కలుపు మొక్కగా భావించి పీకేస్తూ ఉంటారు. కానీ గాడిద గడపాకు మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిని ఉపయోగించడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. చర్మ సమస్యలను, గాయాలను, చాలా కాలం నుండి మానని పుండ్లను తగ్గించడంలో ఈ మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ మొక్క ఆకులను ఆముదంతో కలిపి మెత్తగా నూరి చర్మ సమస్యలు, గాయాలు, పుండ్లపై ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల చర్మ వ్యాధులు, పండ్లు త్వరగా తగ్గిపోతాయి. అలాగే గాడిదగడపాకు మొక్క ఆకులను పది, మిరయాలను పదింటిని తీసుకుని మెత్తగా నూరి చిన్న చిన్న గోళీలుగా చేసుకోవాలి. ఈ గోళీలను ఉదయం పరగడుపున నీటితో కలిపి తీసుకోవడం వల్ల కడుపులో ఉండే నులిపురుగులు, ఎలిక పాములు అన్నీ నశిస్తాయి. అలాగే ఈ మొక్క ఆకులను, ఆముదంతో కలిపి మెత్తగా నూరాలి. తరువాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న మాత్రలుగా చేసుకోవాలి. ఈ మాత్రలను స్త్రీలు నీటితో కలిపి తీసుకోవడం వల్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పులన్నీ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
అదే విధంగా గాడిద గడపాకును మెత్తగా నూరి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని మూడు నుండి నాలుగు చుక్కల మోతాదులో ముక్కులో వేయడం వల్ల మూర్ఛ పోయిన వ్యక్తి మరలా లేచి కూర్చుంటాడని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు ఈ గాడిదగడపాకును మెత్తగా నూరి గోళిలంత ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలను రోజుకు ఒకటి చొప్పున మూడు నుండి నాలుగు రోజుల పాటు ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుండి బయటపడవచ్చు. ముఖ్యంగా స్త్రీలు ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. ఇవే కాకుండా ఈ గాడిదగడపాకును ఉపయోగించడం వల్ల మనం ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చని దీనిని ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.