Kobbari Karam : ఎండు మిర్చి, పల్లీలు, చింతపండు వేసి చేసే నల్లకారం పొడిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఇందులో ఇంకా కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వంటి ఆకుకూరలను కూడా వేసి తయారు చేయవచ్చు. ఒక్కో కారం పొడి ఒక్కో భిన్నమైన రుచిని కలిగి ఉంటుంది. ఈ కారం పొడులు ఇడ్లీ, దోశ వంటి బ్రేక్ ఫాస్ట్‌లతోపాటు అన్నంలోకి కూడా బాగుంటాయి. నెయ్యితో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటాయి. ఇక కొబ్బరితోనూ ఇలాంటి కారం పొడిని తయారు చేయవచ్చు. ఇది కూడా ఎంతో రుచిగా ఉంటుంది. తయారు చేయడం కూడా సులభమే. కొబ్బరికారం పొడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరికారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎండు కొబ్బరి తురుము – పావు కిలో, ఎండు మిరపకాయలు – 50 గ్రాములు, వెల్లుల్లి – 1, ఉప్పు – రుచికి సరిపడా, జీలకర్ర – 2 టేబుల్ స్పూన్లు.
కొబ్బరికారం పొడిని తయారు చేసే విధానం..
ఎండు మిరపకాయలు, జీలకర్రలను నూనె లేకుండా దోరగా వేయించి ఉప్పు కలిపి మెత్తగా మిక్సీ పట్టాలి. తరువాత ఈ మిశ్రమంలో ఎండు కొబ్బరి తురుము, వెల్లుల్లి కలిపి కొద్దిగా బరకగా ఉండేట్లుగా మిక్సీ పట్టాలి. దీంతో ఎంతో రుచికరమైన కొబ్బరికారం పొడి తయారవుతుంది. ఇది అన్నంతోపాటు ఇడ్లీ, దోశ వంటి టిఫిన్లలోకి కూడా ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఎప్పుడూ చేసే కారం పొడికి బదులుగా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. రుచి చూస్తే విడిచిపెట్టరు.