Gangavavili Aku Kura : మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని మనం వివిధ రకాల ఆకుకూరలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో గంగవాయిల కూర కూడా ఒకటి. చాలా మంది ఈ ఆకుకూరను ఇష్టంగా వండుకుని తింటూ ఉంటారు. పోషకాల గనిగా ఈ ఆకుకూరను చెప్పవచ్చు. దీనిని గంగవావిలి ఆకు, గంగ బెల్లి ఆకు అని వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. దీనిని ఇంగ్లీష్ లో పార్స్ లేన్ అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం పోర్టులెకియా ఒలెరేసియా. ఈ గంగవావిలి ఆకు కూర ఎరుపు, తెలుపు రెండు రంగుల్లో ఉంటుంది. ఈ మొక్క ఆకులు చిన్నగా, దళసరిగా ఉంటాయి. అలాగే దీనికి పసుపు రంగులో చిన్న పూలు కూడా పూస్తాయి. గంగవావిలి మొక్క ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది. ఈ ఆకుకూర కొద్దిగా పుల్లటి రుచిని కలిగి ఉంటుంది. దీనితో పప్పు, కూర వంటి వివిధ రకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటారు.
విదేశాల్లో ఈ ఆకుకూరను ఎక్కువగా సలాడ్ లలో వేసుకుని తింటూ ఉంటారు. గంగవావిలి ఆకుకూరలోని పోషకాల గురించి తెలిస్తే మనందరం ఆవ్చర్యపోవాల్సిందే. ఏ ఆకుకూరలో లేనన్ని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఈ ఆకుకూరలో ఉన్నాయి. ముఖ్యంగా గుండె జబ్బులు, పక్షవాతం, ఎ డి హెచ్ డి, ఆటిజం వంటి సమస్యలను నివారించే గుణాలు ఈ ఆకుకూరలో ఉన్నాయి. అలాగే ఈ ఆకుకూరలో విటమిన్ ఎ, సి, ఇ లతో పాటు, బి కాంప్లెక్స్ విటమిన్స్, పొటాషియం, క్యాల్షియం, మాంగనీస్, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఆకుకూరలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కనుక బరువు తగ్గడంలో గంగవావిలి ఆకు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగపరచడంలో కూడా ఈ ఆకుకూర మనకు దోహదపడుతుంది. ఈ ఆకుకూరను తీసుకోవడం వల్ల ఓరల్ క్యావిటీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణుల పరిశోధనల్లో తేలింది.
గంగవావిలి ఆకుకూరను తీసుకోవడం వల్ల చర్మం మరియు జుట్టు అందంగా కాంతివంతంగా తయారవుతాయి. అలాగే దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. గంగవావిలి ఆకుకూరను వారానికి ఒకసారి తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మాంసాహారం తినని వారు ఈ ఆకుకూరను తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. దీనిని తీసుకోవడం వల్ల చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ విధంగా గంగవావిలి ఆకుకూర మనకు ఎంతో మేలు చేస్తుందని దీనిని తప్పకుండా వారానికి ఒకసారైనా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.