Kasivinda Plant : మన ఇంటి చుట్టూ పరిసరాలలో అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉండనే ఉంటాయి. అలాంటి వాటిల్లో కసివింద మొక్క కూడా ఒకటి. దీనిలో పెద్ద కసివింద, చిన్న కసివింద అనే రెండు రకాలు ఉంటాయి. ఈ మొక్కలు మనకు విరివిరిగా కనిపిస్తూ ఉంటాయి. కసివింద మొక్క తడి ఉండే ప్రదేశంలో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఈ మొక్క బంగారు రంగు పువ్వులను కలిగి ఉంటుంది. కసివింద మొక్క కాయలు సన్నగా, పొడుగ్గా ఉంటాయి. దీనిని చాలా మంది కలుపు మొక్కగా భావిస్తూ ఉంటారు. కానీ కసివింద మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీనిని వాడడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. కసివింద మొక్క వల్ల కలిగే ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా కాలం నుండి వేధిస్తున్న గాయాలను, పుండ్లను తగ్గించడంలో ఈ కసివింద మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఆకులను మెత్తగా నూరి దానిని పై పూతగా రాయడం వల్ల గాయాలు, పుండ్లు తగ్గుతాయి.
కీళ్ల వాతంతో బాధపడే వారు కసివింద మొక్క ఆకులను వెన్నలో వేసి బాగా వేయించాలి. ఇలా వేయించగా వచ్చిన నూనెను రాసి ఆకులను కట్టుగా కట్టడం వల్ల కీళ్ల వాతం తగ్గుతుంది. అతి మూత్ర వ్యాధిని తగ్గించడంలో కసివింద గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ గింజలను పెనంలో వేసి దోరగా వేయించి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని తేనెతో కలిపి భోజనానికి గంట ముందు తీసుకోవడం వల్ల అతి మూత్ర వ్యాధి తగ్గుతుంది. బోదకాలు సమస్యను తగ్గించే శక్తి కూడా కసివింద మొక్కకు ఉంది. చిన్న కసివింద మొక్క వేరును శుభ్రంగా కడిగి నీడలో ఎండబెట్టి పొడిగా చేసి ఆ పొడిని ఒక వస్త్రంలో వేసి జల్లించి నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసుకున్న పొడిని పావు టీ స్పూన్ మోతాదులో తీసుకుని దానికి ఒక టీ స్పూన్ ఆవు నెయ్యిని కలిపి రోజుకు రెండు పూటలా తీసుకుంటూ ఉండడం వల్ల బోదకాలు సమస్య తగ్గుతుంది.
రేచీకటిని నివారించడంలో కసివింద మొక్క అద్భుతంగా పని చేస్తుంది. చిన్న కసివింద మొక్క పూలను మెత్తగా నూరి రసాన్ని తీయాలి. రోజూ రాత్రి పడుకునే ముందు రెండు చుక్కల చొప్పున రెండు కళ్లల్లో వేసుకుని పడుకోవాలి. ఇలా చేయడం వల్ల రేచీకటి సమస్య తగ్గుతుంది. చల్లిజ్వరాన్ని తగ్గించడంలో కసివింద వేర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. 10 గ్రా.ల కసివింద వేర్లను తీసుకుని శుభ్రంగా కడిగి రెండు గ్లాసుల నీళ్లలో వేసి ఒక గ్లాసు అయ్యే వరకు మరిగించాలి. ఈ నీరు గోరు వెచ్చగా ఉన్నప్పుడే తాగడం వల్ల చలిజ్వరం తగ్గుతుంది. ఈ విధంగా కలుపు మొక్కగా భావించే కసివింద మనకు ఎంతో ఉపయోగపడుతుందని, దీనిని వాడి అనేక రోగాలను నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.