Neerugobbi Plant : నీరు గొబ్బి చెట్టు.. ఈ మొక్కను మనలో చాలా మంది చూసే ఉంటారు. వర్షాకాలంలో నీటి కుంటల్లో, చెరువుల్లో ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుంది. చాలా మంది ఈ మొక్కను పిచ్చి మొక్క అనుకుంటారు. కానీ ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఈ మొక్కలో ప్రతి భాగం కూడా ఔషధమయమై ఉంటుంది. నీరు గొబ్బి మొక్క గింజలను ఉపయోగించి పురుషులు వారి యవ్వనాన్ని, శరీర ధారుడ్యాన్ని నిండు నూరేళ్ల వరకు కాపాడుకోవచ్చు. నీరు గొబ్బి మొక్కను సంస్కృతంలో కోకిలాక్షా అని హిందీలో తాళంకన అని పిలుస్తారు. ఈ మొక్కకు పదునైనా ముళ్లు ఉంటాయి. తెలుపు, నలుపు మరియు ఊదా రంగు పూలని కలిగి ఉంటాయి. అలాగే ఆకులు సన్నగా, పొడవుగా ఉంటాయి. తెలుపు, ఊదా రంగు పూలను కలిగి ఉండే నీరు గొబ్బి మొక్క మరిన్ని ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ మొక్క తీపి రుచితో చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది.
పైత్య రోగాలను, కఫ రోగాలను, అతిసారాన్ని పోగొట్టడంలో ఈ మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మొక్క గింజలను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. నీరు గొబ్బి మొక్క గింజలను, దూల గొండి గింజలను సమానంగా తీసుకుని అవి మునిగే వరకు పాలు పోయాలి. తరువాత ఈ పాలు అయైపోయే వరకు చిన్న మంటపై బాగా మరిగించాలి. తరువాత ఈ గింజలను ఆరబెట్టి పొడిగా చేసి దీనికి సమానంగా పటిక బెల్లం పొడిని కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో రెండు పూటలా గోరు వెచ్చని పాలల్లో కలిపి తీసుకుంటే పురుషుల్లో అమితమైన వీర్య వృద్ధి కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. గొబ్బి చెట్టు వేరును, ఆముదం చెట్టు వేరును, పల్లేరు చెట్టు వేరును విడివిడిగా ఎండబెట్టి పొడిలా చేసుకుని సమానంగా కలిపి నిల్వ ఉంచుకోవాలి.
ఈ పొడిని రెండు పూటలా అర టీ స్పూన్ మోతాదులో అర కప్పు వేడి పాలల్లో కలిపి తీసుకుంటే మూత్రపిండాల్లో, పిత్తాశయంలో రాళ్ల సమస్య నుండి బయటపడవచ్చు. ఈ మొక్క వేరును మాడుపై ఉంచి ఊడిపోకుండా వస్త్రంతో కట్టుకుని నిద్రపోవాలి. ఇలా చేయడం వల్ల నిద్రలేమి సమస్య నుండి చాలా సులువుగా బయటపడవచ్చు. గొబ్బి చెట్టును సమూలంగా సేకరించి దానికి సమానంగా తిప్ప తీగను కలిపి నీటిలో వేసి మరిగించి కషాయంలా చేసుకోవాలి. ఈ కషాయాన్ని రోజుకు రెండు పూటలా 30 నుండి 60 ఎమ్ ఎల్ మోతాదులో తీసుకోవడం వల్ల గౌట్ సమస్య నుండి బయటపడవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో వాత రోగానల్నీ తగ్గు ముఖం పడతాయి. ఈ మొక్కను కాల్చగా వచ్చిన బూడిదను సేకరించి నిల్వ చేసుకోవాలి.
ఈ బూడిదను రోజూ అర టీ స్పూన్ మోతాదులో అర కప్పు నీటిలో లేదా గోమూత్రంలో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో వాపులు తగ్గుతాయి. అలాగే మూత్రపిండాల వైఫల్యం సమస్యతో బాధపడే వారు ఈ మొక్క ఆకుల రసాన్ని రెండు పూటలా ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం తిరిగి బాగుపడుతుంది. నీరు గొబ్బి గింజల పొడిని, దూలగొండి గింజల పొడిని సమానంగా కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో అప్పుడే పితికిన ఆవు పాలల్లో, కొద్దిగా చక్కెర కలిపి తీసుకోవడం వల్ల పురుషుల్లో వచ్చే శీఘ్రస్కలనం సమస్య తగ్గుతుంది. ఈ మొక్కను సమూలంగా సేకరించి దంచి రసాన్ని తీయాలి. ఈ రసానికి సమానంగా ఆముదం నూనెను కలిపి గోరు వెచ్చగా చేయాలి. ఈ నూనెను నొప్పులు ఉన్న భాగంలో చర్మం పై రాసి మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.
గొబ్బి వేరుతో కషాయాన్ని చేసుకుని 50 నుండి 6-0 ఎమ్ ఎల్ మోతాదులో ఈ కషాయాన్ని రెండు పూటలా తీసుకోవడం వల్ల సమస్త మూత్ర రోగాలు నయం అవుతాయి. గొబ్బి చెట్టు గింజలను రెండు టీ స్పూన్ల మోతాదులో అర కప్పు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిలో అర కప్పు చక్కెర పాలను కలిపి తాగాలి. ఇలా మూడు రోజులకు ఒక్కసారి తీసుకోవడం వల్ల పురుషుల్లో వచ్చే వీర్య దోషాలన్ని తొలగిపోతాయి. ఈ విధంగా నీరు గొబ్బి మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.