Nela Vemu : మనకు ఇంటి చుట్టపక్కల అనేక రకాల మొక్కలు పెరుగుతూ ఉంటాయి. కానీ వాటిని మనం పిచ్చి మొక్కలుగా భావించి పీకేస్తూ ఉంటాం. వాటిలోని గొప్పతనం, వాటి విలువ అవి మనకు చేసే మేలు గురించి తెలియక వాటిని మనం పిచ్చి మొక్కలుగా భావిస్తూ ఉంటాం. అలాంటి మొక్కల్లో నేల వేము మొక్క కూడా ఒకటి. దీనిని కర్కాటక శృంగి అని కూడా పిలుస్తారు. ఈ మొక్క చేదు రుచిని కలిగి ఉంటుంది. ఈ నేల వేము మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ దొరుకుతుంది. నేల వేములో నల్లగా, పచ్చగా ఉండే రెండు రకాల మొక్కలు ఉంటాయి. నల్లగా ఉండే నేలవేము మొక్క ఎక్కువగా కొండప్రాంతాల్లో లభిస్తుంది. నేల వేము మొక్కలో ఉండే ఔషధ గుణాల గురించి అలాగే ఈ మొక్క మనకు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా సందర్భాల్లో బాలింతల్లో పాలు విషతుల్యం అవుతూ ఉంటాయి. దీంతో పిల్లలు వాంతి చేసుకోవడం, విరోచనాలు, పిల్లల్లో పాలు అరగకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాంటి సందర్భాల్లో 20 గ్రాముల నేల వామును తీసుకుని 300 ఎమ్ ఎల్ నీటిలో వేసి 150 ఎమ్ ఎల్ అయ్యే వరకు బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి రుచి కొరకు కండచక్కెరను కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బాలింతల్లో వచ్చే క్షీరదోషాలు తొలగిపోతాయి. అలాగే చాలా మంది రక్తంలో మలినాలు ఎక్కువయ్యి ఒంట్లో మంటలు, మూత్రంలో మంట, ముక్కు నుండి రక్తం కారడం, శరీరం ఎల్లప్పుడూ వేడిగా ఉండడం వంటి సమస్యల బారిన పడుతూ ఉంటారు. అలాంటి వారు 20 గ్రాముల నేలవాము ఆకుల రసాన్ని, 10 గ్రాముల గంధం పొడిని కలిపి భోజనానికి ముందు తీసుకోవడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు.
ఇలా చేయడం వల్ల రక్తపైత్యం వల్ల కలిగే ఇబ్బందుల నుండి బయట పడవచ్చు. నేల వాము ఆకులను, శొంఠిని సమానంగా తీసుకుని కషాయంలా చేసుకోవాలి. ఈ కషాయాన్ని ఉదయం పరగడుపున అలాగే సాయంత్రం పూట తీసుకోవడం వల్ల ఉబ్బు రోగం తగ్గుతుంది. అలాగే నేల వేమును, తులసి ఆకులను సమానంగా కలిపి కషాయంలా చేసుకోవాలి. ఈ కషాయాన్ని తీసుకోవడం వల్ల వైరల్ ఫీవర్స్, విష జ్వరాలు తగ్గుతాయి. అదే విధంగా నేల వేమును, తిప్పతీగను, తుంగ ముస్థలను, శొంఠిని సమపాలల్లో తీసుకుని కషాయంలా చేసుకోవాలి. ఈ కషాయాన్ని తీసుకోవడం వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి.
తరచూ నీరసం, నిస్సత్తువ వంటి సమస్యలతో బాధపడే వారు నేల వేము కషాయాన్ని తీసుకున్న తరువాత ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్కను నోట్లో వేసుకుని నములుతూ మింగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. నేల వేమును, మాను పసుపును కలిపి చర్మం మీద లేపనంగా రాయడం వల్ల వివిధ రకాల చర్మ సమస్యలు తగ్గుతాయి. ఈ విధంగా నేల వేము మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని ఉపయోగించడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.