Saraswati Plant : ప్రస్తుత కాలంలో చాలా మంది పిల్లల్లో మాటలు సరిగ్గా రాకపోవడం, జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడం వంటి సమస్యలను మనం గమనిస్తున్నాం. పిల్లలే కాకుండా కొందరు పెద్దవారు కూడా నత్తిగా మాట్లాడడం, మాట్లాడిందే మళ్లీ మళ్లీ మాట్లాడడం, కొన్ని రకాల అక్షరాలను పలక లేక పోవడం వంటి లక్షణాలను మనం చూడవచ్చు. మాటలు రావడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఫలించని వారు ఉంటారు. అలాంటి వారు ఆయుర్వేదం ద్వారా వారి వారి సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
ఆయుర్వేదంలో సరస్వతి మాతగా భావించే సరస్వతి మొక్కను ఉపయోగించి మనం ఈ సమస్యలన్నింటి నుండి బయట పడవచ్చు. సరస్వతి మొక్క ఆకులు తెలుగు అక్షరం ద ఆకారంలో, చుట్టూ నొక్కులు నొక్కులుగా ఉంటాయి. ఈ మొక్క ఆకుల రుచి చేదుగా, వగరుగా ఉంటుంది. చిన్న మొక్కను మనం నేలలో నాటితే దానంతట అదే వ్యాప్తి చెందుతుంది. పిల్లల్లో మెదడు అభివృద్ది చెందడానికి, మాటలు సరిగ్గా రావడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి ఈ మొక్క ఎంతో సహాయపడుతుంది.
వృద్దులల్లో వచ్చే మతిమరుపును తగ్గించడంలో కూడా ఈ మొక్క ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఆకుల రసాన్ని పాలలో కలిపి పిల్లలకు ఇవ్వడం వల్ల మాటలు సరిగ్గా వస్తాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పెద్ద వారు కూడా పాలలో ఈ ఆకుల రసాన్ని కలిపి తాగవచ్చు లేదా భోజనం తరువాత ఈ చెట్టు ఆకులను నేరుగా తినవచ్చు. ఇలా చేయడం వల్ల జ్ఞాపక శక్తి పెరగడమే కాకుండా నత్తి తగ్గి మాటలు కూడా సరిగ్గా వస్తాయి. చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఈ మొక్క తప్పకుండా ఉండాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ మొక్క ఆకుల రసాన్ని చిన్నారులు అయితే పావు టీస్పూన్, పెద్దలు అయితే అర టీస్పూన్ తీసుకోవాలి. రాత్రి పూట పాలలో కలిపి తాగితే మేలు జరుగుతుంది.