Sarpagandha : ఆయుర్వేదంలో ఎన్నో మొక్కల ప్రస్తావన ఉంది. ఎన్నో వృక్షాలకు చెందిన భాగాలను కూడా వైద్యంలో ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలోనే కొన్ని మొక్కల గురించి చాలా మందికి తెలియదు. కానీ నిజానికి ఆ మొక్కల వల్ల ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. అనారోగ్యాలను వాటితో నయం చేసుకోవచ్చు. అలాంటి మొక్కల్లో సర్పగంధ ఒకటి. దీన్నే ఇండియన్ స్నేక్‌రూట్ అంటారు. ఇది చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే మొక్క అని చెప్పవచ్చు.
ఆయుర్వేదంలో సర్పగంధకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. ఈ మొక్కకు చెందిన వేళ్లను పలు రకాల వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగిస్తారు.
సర్పగంధ చిన్నవైన పింక్, తెలుపు రంగు పువ్వులను కలిగి ఉంటుంది. ఈ మొక్క వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. సర్పగంధ హైబీపీని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో రెసర్‌పైన్ అనే సమ్మేళనం ఉంటుంది. అందువల్ల హైబీపీ తగ్గుతుంది.
2. సర్పగంధ వేళ్లను నమిలితే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. నిద్రలేమి తగ్గుతుంది. రాత్రి చక్కగా నిద్ర పడుతుంది.
3. స్త్రీలకు నెల నెలా రుతు సమయంలో వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు సర్పగంధ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. నెలసరి సరిగ్గా వచ్చేలా చేస్తుంది. దీంతోపాటు మలబద్దకం, విరేచనాలు వంటివి తగ్గిపోతాయి.
4. మొటిమలు, గజ్జి, తామర, దద్దుర్లు, దురద వంటి చర్మ సమస్యలను తగ్గించేందుకు కూడా సర్పగంధ పనిచేస్తుంది. దీంట్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల చర్మ ఇన్‌ఫెక్షన్లు కూడా తగ్గుతాయి.
5. సర్పగంధ వేళ్ల పొడిని రోజూ తీసుకోవడం వల్ల ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాస కోశ సమస్యలు తగ్గుతాయి.
6. ప్రస్తుత తరుణంలో గుండె జబ్బులు అనేవి కామన్ అయిపోయాయి. దీంతోపాటు హైబీపీ కూడా వస్తోంది. కనుక ఈ సమస్యలు ఉన్నవారు సర్పగంధను వాడడం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బీపీ తగ్గుతుంది. ఇతర దుష్పరిణామాలు ఏర్పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
7. నిద్రలేమి సమస్య ఉన్నవారికి సర్పగంధ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. దీని పొడిని రోజూ రాత్రి పాలలో కలుపుకుని తాగితే గాఢంగా నిద్ర పడుతుంది. ఒత్తిడి, అలసట తగ్గిపోతాయి. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
8. సర్పగంధ పొడిని వాడడం వల్ల మహిళలకు రుతు సమయంలో వచ్చే నొప్పి, అలసట తగ్గుతాయి. సర్పగంధలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు నొప్పులను తగ్గిస్తాయి.
సర్పగంధ మనకు మార్కెట్‌లో పొడి, ట్యాబ్లెట్ల రూపంలో లభిస్తోంది. వాటిని డాక్టర్ సూచన మేరకు వాడుకోవచ్చు.