వావిలి చెట్టు.. ఈ చెట్టు గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. దీనిని సంస్కృతంలో సింధువారము అని పిలుస్తారు. వినాయక చవితి రోజున వినాయకుడిని పూజించే ఏక విసంతి ప్రతాలలో సింధూవార పత్రం పద్నాలుగవది. వావిలి చెట్టు మనకు గ్రామాలలో, రోడ్డుకు ఇరువైపులా విరివిరిగా కనబడుతుంది. ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో ఈ చెట్టును ఎప్పటి నుండో ఔషధంగా వినియోగిస్తున్నారు. ఈ చెట్టులో ప్రతి భాగం కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.
మనకు వచ్చే వాతపు నొప్పులను అరికట్టడంలో వావిలి చెట్టు అద్భుతంగా పని చేస్తుంది. పూర్వకాలంలో ఈ చెట్టు ఆకులను వేసి వేడి చేసిన నీటితో బాలింతలకు స్నానం చేయించేవారు. ఇలా చేయడం వల్ల వారికి ఉండే నొప్పులన్నీ తొలగిపోతాయి. శారీరక శ్రమ అధికంగా చేసేవారు ఈ చెట్టు ఆకులను వేసి వేడి చేసిన నీటితో స్నానం చేయడం వల్ల శారీరక బడలిక తీరి హాయిగా నిద్రపడుతుంది. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వంటి వాటిని నయం చేయడంలో కూడా వావిలి చెట్టు మనకు ఉపయోగపడుతుంది. ఈ నొప్పులతో బాధపడే వారు వావిలి చెట్టు ఆకులను మెత్తగా నూరి నొప్పి ఉన్న చోట ఉంచి కట్టుకట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఈ ఆకులను కొద్దిగా నలిపి తలపై పట్టుగా వేయడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. జలుబు, ముక్కు దిబ్బడ వంటి వాటితో బాధపడుతున్నప్పుడు వేడి నీటిలో వావిలి ఆకులను వేసి మరిగించి ఆ నీటితో ఆవిరి పట్టాలి. ఇలా చేయడం వల్ల జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది. వావిలి చెట్టు ఆకుల నుండి తీసిన రసానికి సమానంగా నువ్వుల నూనెను కలిపి నూనె మిగిలే వరకు వేడి చేయాలి. ఈ తైలాన్ని లేపనంగా రాస్తూ ఉండడం వల్ల గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు నయం అవుతాయి.
వావిలి చెట్టు ఆకులతోపాటు గాడిదడపాకు, ఆముదం ఆకు, జిల్లేడు ఆకు, గుంటగలగరాకు, కుప్పింటాకులను సమపాళ్లల్లో తీసుకుని వాటి నుండి రసాన్ని తీయాలి. ఈ రసానికి సమపాళ్లల్లో నువ్వుల నూనెను కలిపి నూనె మిగిలే వరకు వేడి చేయాలి. ఈ నూనెను గోరు వెచ్చగా ఉండగానే రోజుకు రెండు పూటలా కీళ్ల నొప్పులు, నడుము నొప్పిపై రాస్తూ మర్దనా చేయడం వల్ల నొప్పుల నుండి విముక్తి కలుగుతుంది. వావిలి ఆకులతో చేసిన కషాయాన్ని గొంతులో పోసుకుని పుక్కిలించడం వల్ల గొంతునొప్పి, నోటిపూత వంటి సమస్యలు తగ్గుతాయి.
వావిలి చెట్టు పూలను కాలేయం, గుండె సంబంధిత సమస్యలను నయం చేయడంలో, అలాగే కలరా వ్యాధిని నివారించడంలో విరివిరిగా ఉపయోగిస్తారు. లేత వావిలి ఆకులను కూరగా వండుకుని తినడం వల్ల ముక్కు నుండి రక్తకారడం తగ్గుతుంది. నడుము నొప్పితో బాధపడుతున్న వారు వావిలి చెట్టు వేర్ల పొడిని నువ్వుల నూనెలో కలిపి రోజుకు మూడు పూటలా టీ స్పూన్ మోతాదులో తీసుకోవడం వల్ల నడుము నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
ఈ చెట్టు ఆకులు యాంటీ సెప్టిక్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. గాయాలు తగిలినప్పుడు ఈ చెట్టు ఆకులను మెత్తగా నూరి గాయాలపై ఉంచి కట్టుకట్టడం వల్ల గాయాలు త్వరగా మానిపోతాయి. వావిలి చెట్టు ఆకులను ఎండబెట్టి వాటితో పొగవేయడం వల్ల దోమలు నివారించబడతాయి. ఈ విధంగా వావిలి చెట్టు మనకు వచ్చే అనారోగ్య సమస్యలతోపాటు శరీరంలో ఉండే నొప్పులను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.