Papaya Tree : మనం ఆహారంగా తీసుకునే పండ్లలో బొప్పాయి పండ్లు కూడా ఒకటి. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. బొప్పాయి పండు రుచి ఎంతో మధురంగా ఉంటుంది. ఇతర పండ్ల లాగా ఈ పండు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. బొప్పాయి పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని సంస్కృతంలో మధురకటి అని, హిందీలో అండకర్బూజ అని పిలుస్తారు. దీనిని కొన్ని ప్రాంతాలలో మదనానబ అని కూడా అంటారు. ఇది ఫల ప్రధానమైన చెట్టు. బొప్పాయి చెట్టు దాదాపు 10 మీటర్ల ఎత్తు వరకు పెరగుతుంది. ఈ చెట్టు నిండా నీరు ఉంటుంది. ఇటీవలి కాలంలో హైబ్రిడ్ బొప్పాయి చెట్లను కూడా పెంచుతున్నారు. కానీ ఇవి ఔషధంగా పనికి రావని నిపుణులు చెబుతున్నారు. కేవలం నాటు బొప్పాయి చెట్లు, నాటు బొప్పాయి పండ్లే ఔషధంగా పనికి వస్తాయని వారు చెబుతున్నారు.
ఈ పండ్లను తినడం వల్ల పిత్త రోగాలన్నీ తగ్గుతాయి. బొప్పాయి పండ్లను తినడం వల్ల పురుషులల్లో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది. అంతేకాకుండా బుడ్డ రోగం, ఉన్మాదం తగ్గుతుంది. పచ్చి బొప్పాయిలో గింజలను, పైన పొట్టును తీసేసి లోపలి గుజ్జును చిన్న ముక్కలుగా కోసి, నువ్వుల పిండితో కలిపి కూరగా చేసుకుని తినడం వల్ల బాలింతలల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. బొప్పాయి ఆకులను దంచి వాటికి ఆముదాన్ని కలిపి ఉడకబెట్టి గోరు వెచ్చగా ఉన్నప్పుడే శరీరంలో నొప్పులు ఉన్న చోట ఉంచి కట్టుగా కట్టడం వల్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. పచ్చి బొప్పాయి నుండి వచ్చే పాలను సేకరించి వాటికి సమానంగా నెయ్యిని కానీ కొబ్బరి నూనెను కానీ కలిపి లేపనంగా రాయడం వల్ల గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి. పచ్చి బొప్పాయి నుండి వచ్చే పాలను నేరుగా చర్మం పై రాయ కూడదు. ఇలా చేయడం వల్ల చర్మం పై పొక్కులు వస్తాయి.
బొప్పాయి ఆకులకు పసుపును కలిపి దంచి బోద వాపులపై పట్టుగా వేస్తూ ఉంటే బోద రోగం అదుపులోకి వస్తుంది. రోజూ రాత్రి ఏడు గంటల లోపు భోజనం చేసి రాత్రి 10 గంటల సమయంలో బాగా పండిన బొప్పాయిని తినడం అలవాటు చేసుకుంటే కాలేయ సమస్యలు రాకుండా ఉంటాయి. ఆలస్యంగా ఉడికే కూరలలో రెండు లేదా మూడు బొప్పాయి ముక్కలను వేయడం వల్ల కూర త్వరగా ఉడుకుతుంది. బొప్పాయి చెట్టుకు గాటు పెట్టగా వచ్చిన పాలను సేకరించి తేలు కుట్టిన చోట ఆ పాలను వేసి రుద్దుతూ ఉంటే తేలు విషం హరించుకు పోతుంది. బొప్పాయి పువ్వులను తీసుకుని పేను కొరికిన చోట రెండు పూటలా రుద్దుతూ ఉంటే పెనుకొరుకుడు తగ్గి మరలా ఆ ప్రాంతంలో కొత్త వెంట్రుకలు కూడా వస్తాయి. పచ్చి బొప్పాయిని కూరగా చేసుకుని తినడం వల్ల శరీరంలో ఎక్కువగా ఉన్న నీరు పోతుంది. నొప్పులు, వాపులు కూడా తగ్గుతాయి.
బొప్పాయ పండును తినడం వల్ల మూత్రనాళంలో వచ్చిన వ్రణాలు తగ్గుతాయి. దీనిని పరగడుపున తినడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఈ పండ్లను రోజుకు రెండు చొప్పున తినడం వల్ల నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. బొప్పాయి పండ్లు చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. శరీరంలో అధికంగా ఉన్న వేడిని తగ్గించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ ఇది ఆలస్యంగా జీర్ఱమయ్యి కఫాన్ని, వాతాన్ని పెంచుతుంది. కనుక దీనిని చలువ శరీరం కలవారు అధికంగా తినకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు పచ్చి బొప్పాయి పండ్లను తినకూడదు. వీటిని తినడం వల్ల గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా బొప్పాయి పండ్లను తినడం వల్ల, బొప్పాయి చెట్టును ఉపయోగించి అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.