Milk : ప్రస్తుత తరుణంలో మనం తింటున్న.. తాగుతున్న ఆహారాలు, ద్రవాలు అన్నీ ప్యాకెట్లలో నిల్వ చేసినవే అయి ఉంటున్నాయి. చాలా మందికి స్వచ్ఛమైన ఆహారాలు లభ్యం కావడం లేదు. ప్యాకెట్లలో నిల్వ చేసిన వాటినే రోజూ తీసుకుంటున్నారు. అయితే ప్యాకెట్ పాలను తాగవచ్చా ? అవి హానికరమా ? మనకు హానిని కలగజేస్తాయా ? అని చాలా మందికి సందేహాలు వస్తుంటాయి. మరి అందుకు నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందామా..!
ప్యాకెట్ పాలు హానికరమని, వాటిల్లో రసాయనాలు కలుపుతారని.. చాలా మందికి అపోహలు ఉంటాయి. అయితే వాస్తవానికి ప్యాకెట్ పాలు హానికరం కాదు. వాటిని తాగవచ్చు. అలా అని చెప్పి అవి మరీ ఆరోగ్యకరమైనవి కావు. ఎందుకంటే.. స్వచ్ఛమైన పాలకు, ప్యాకెట్ పాలకు చాలా తేడా ఉంటుంది. స్వచ్ఛమైన పాలలో పోషకాలు అన్నీ అలాగే ఉంటాయి. మనం వేడి చేస్తే సూక్ష్మ జీవులు నశిస్తాయి. దీంతో ఆ పాలను మనం ఉపయోగించుకుంటాం. అంతేకానీ స్వచ్ఛమైన పాలలో పోషకాలు పోవు.
ఇక ప్యాకెట్ పాలు అలా కాదు. వాటిని నిల్వ ఉంచేందుకు గాను వాటిల్లో కలిపే ప్రిజర్వేటివ్స్ వల్ల, పలు ఇతర కారణాల వల్ల ప్యాకెట్ పాలలో ఉండే పోషకాలు నశిస్తాయి. ఆ పాలలో ఉండే వెన్నను తీసి విక్రయిస్తారు. కనుక అలాంటి పాలను తాగితే మనకు పెద్దగా పోషకాలు లభించవు. కానీ ఆ పాలు అధిక బరువు ఉన్నవారికి, గుండె జబ్బులు, డయాబెటిస్ ఉన్నవారికి మేలు చేస్తాయి. వారు ఆ పాలను తాగవచ్చు. వాటిలో ఫ్యాట్ ఉండదు. కాబట్టి ఆయా సమస్యలు ఉన్నవారు ప్యాకెట్ పాలను తాగవచ్చు. అలా అని చెప్పి వారు స్వచ్ఛమైన పాలను తాగకూడదు అని కాదు. కానీ ప్యాకెట్ పాలలో కొవ్వు తక్కువగా ఉంటుంది కనుక కొద్దిగా ఎక్కువ మొత్తంలో వాటిని వారు తాగినా.. ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదన్నమాట.
కనుక ఎవరైనా సరే స్వచ్ఛమైన పాలు లభించే అవకాశం ఉంటే వారు ఆ పాలనే తాగడం మంచిది. ఇక మిగిలిన వారికి ఆ అవకాశం ఉండదు కనుక వారు కచ్చితంగా ప్యాకెట్ పాలనే వాడుతారు. కానీ ప్యాకెట్ పాలను తాగకూడదని, అవి హాని కలిగిస్తాయని అనడంలో ఎంత మాత్రం నిజం లేదు. అది పూర్తిగా అవాస్తవమని చెప్పవచ్చు. ప్యాకెట్ పాలను తాగితే ఎలాంటి హాని కలగదు. కానీ పోషకాలు తక్కువగా ఉంటాయి. అంతే తప్ప.. ప్యాకెట్ పాలను తాగితే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురు కావు..!