నీటిని తాగే విషయంలో చాలా మందికి అనేక అపోహలు ఉంటాయి. భోజనం చేసే ముందు నీళ్లను తాగవద్దని కొందరంటారు. భోజనం అనంతరం నీళ్లను తాగవద్దని ఇంకొందరు చెబుతారు. అయితే ఏది నిజం ? నీళ్లను ఎప్పుడు తాగాలి ? వీటి గురించి ఆయుర్వేదం, అల్లోపతి వైద్యం ఏం చెబుతున్నాయి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
భోజనం చేసేటప్పుడు నీళ్లను తాగే విషయం ఆయుర్వేదం, అల్లోపతి వైద్యం రెండూ ఒకే మాట చెబుతున్నాయి. భోజనానికి ముందు లేదా భోజనం చేసే సమయంలో లేదా భోజనం అనంతరం నీళ్లను తాగడం వల్ల జీర్ణ క్రియకు ఆటంకం కలుగుతుంది. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. జీర్ణ రసాలు నీటితో కలిసి పోతాయి. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక ఎక్కువ భాగం వ్యర్థంగా బయటకు వస్తుంది.
అలాగే శరీరం మనం తినే ఆహారాల్లో ఉండే పోషకాలను కూడా గ్రహించలేదు. దీంతోపాటు జీర్ణం కాకుండా మిగిలిపోయే పదార్థాలు కొన్ని కొవ్వు కింద మారుతాయి. దీని వల్ల ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్‌కు దారి తీస్తుంది. అందువల్ల భోజనానికి ముందుగానీ, భోజనం చేసేటప్పుడు గానీ, భోజనం తరువాత గానీ వెంటనే నీళ్లను తాగరాదు.
ఆధునిక వైద్యం అయితే భోజనానికి 30 నిమిషాల ముందు నీటిని తాగాలని, భోజనం అనంతరం 30 నిమిషాల తరువాత నీటిని తాగాలని సూచిస్తోంది. అదే ఆయుర్వేదంలో అయితే ఆ వ్యవధిని 40 నిమిషాలుగా చెబుతున్నారు. అంటే నీటిని తాగితే 40 నిమిషాలు ఆగి భోజనం చేయాలన్నమాట. భోజనం చేశాక మళ్లీ నీటిని తాగేందుకు 40 నిమిషాల పాటు ఆగాలి. ఈ విధంగా నీటిని తాగాల్సి ఉంటుంది.
అయితే భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగాల్సి వస్తే ఎలా ? అంటే కొద్ది కొద్దిగా చప్పరించినట్లు కొద్దిగా నీటిని తాగాలి. కానీ ఎక్కువ మొత్తంలో తాగరాదు. ఈ విధంగా నీటిని తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.