దాదాపుగా అన్ని వయస్సుల వారిని మలబద్దకం సమస్య ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. దీంతో తలనొప్పి వస్తుంది. మూడ్ మారుతుంది. పనిచేయబుద్దికాదు. మలబద్దకం వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అధ్యయనాల ప్రకారం.. ఫైబర్ ఎక్కువగా తినకపోవడం వల్ల, ద్రవాలను ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల మలబద్దకం వస్తుంటుందని వెల్లడైంది. మలబద్దకం వస్తే విరేచనం గట్టిగా అవుతుంది. చాలా కష్టపడాల్సి వస్తుంది. కడుపులో నొప్పి, వికారం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, తృణ ధాన్యాలు, నట్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. ఇక కింద తెలిపిన ఆసనం వేయడం వల్ల కూడా మలబద్దకం సమస్య తగ్గుతుంది. మరి ఆ ఆసనం ఏమిటి ? దాన్ని ఎలా వేయాలి ? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..!
మలబద్దకం సమస్యను తగ్గించుకునేందుకు రోజూ మలాసనం వేయాలి. దీన్నే గార్లాండ్ పోజ్ అంటారు. ఈ ఆసనం వేయడం వల్ల సుఖ విరేచనం అవుతుంది. మలబద్దకం నుంచి బయట పడవచ్చు. దీన్ని ఎలా వేయాలంటే..
మలాసనం వేసేందుకు నిటారుగా నిలబడాలి. కాళ్లను దూరంగా పెట్టాలి. ముందుకు వంగి చేతులను కింద నేలపై ఆనించాలి. తరువాత మోకాళ్లను వంచి కూర్చోవాలి. అనంతరం రెండు చేతులతో నమస్కారం చేస్తూ వాటితో మోకాళ్లను దూరంగా నెట్టాలి. ఈ భంగిమలో కొంత సేపు ఉండాలి. రోజూ ఉదయం 1-2 నిమిషాల పాటు ఈ ఆసనాన్ని వేయవచ్చు.
మలాసం వేయడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు ఖర్చవుతాయి. కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. తొడల వద్ద ఉండే కండరాలు దృఢంగా మారుతాయి. మలబద్దకం మాత్రమే కాకుండా ఇతర జీర్ణ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. జీర్ణాశయం, పేగులు మొత్తం కడిగేసినట్లు క్లీన్ అవుతాయి. జీర్ణాశయ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి.
ఈ ఆసనం వేసే వారు ముందుగా 1, 2 సార్లు కిందకు వంగుతూ పైకి లేస్తూ వార్మప్ చేస్తే మంచిది. దీంతో ఆసనాన్ని సులభంగా వేసేందుకు అవకాశం ఉంటుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ ఆసనం వేయరాదు.