Mangoes : వేసవి సీజన్ వచ్చిందంటే చాలు.. మనకు ఎక్కడ చూసినా మామిడి పండ్లు విరివిగా కనిపిస్తాయి. అనేక రకాల వెరైటీలకు చెందిన మామిడి పండ్లు మనకు దర్శనమిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఎవరి ఇష్టం, స్థోమతకు తగినట్లుగా వారు మామిడి పండ్లను కొనుగోలు చేసి తింటుంటారు. అయితే మామిడి పండ్ల విషయానికి వస్తే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. అదేమిటంటే.. మామిడి పండ్లలో తియ్యదనం అధికంగా ఉంటుంది కదా.. కనుక వాటిని తింటే బరువు పెరుగుతామేమోనని.. చాలా మంది అనుమానాం వెలిబుచ్చుతుంటారు. అయితే దీనికి న్యూట్రిషనిస్టులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
మామిడి పండ్లలో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ఎన్నో విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ పండ్లలో విటమిన్ సి, బీటా కెరోటిన్, విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, కాపర్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. అయితే మామిడి పండ్లు తియ్యదనం ఎక్కువగా కలిగా ఉంటాయి. వీటిల్లో సహజసిద్ధమైన చక్కెరలు ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఈ పండ్లు ఎక్కువ తియ్యగా అనిపిస్తాయి. అయితే మామిడి పండ్లను తినడం వల్ల ఎట్టి పరిస్థితిలోనూ బరువు పెరగరని వైద్యులు చెబుతున్నారు.
మామిడి పండ్లలో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయని.. ఇవి శరీరానికి మేలు చేస్తాయి కానీ కీడు చేయవని.. అందువల్ల మామిడి పండ్లను తింటే బరువు పెరుగుతామేమోనన్న అపోహను వీడాలని.. వైద్యులు చెబుతున్నారు. ఈ పండ్లను తినడం వల్ల బరువు పెరగరని అంటున్నారు. పైగా బరువు తగ్గేందుకు ఈ పండ్లు సహాయ పడతాయని చెబుతున్నారు. అలాగే మధుమేహం ఉన్నవారు కూడా రోజుకు 100 గ్రాముల మోతాదులో ఈ పండ్లను తినవచ్చని.. దీంతో షుగర్ లెవల్స్ ఏమీ పెరగవని చెబుతున్నారు. కాబట్టి అధిక బరువు ఉన్నవారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పండ్లను నిర్భయంగా తినవచ్చు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు.
ఇక మామిడి పండ్లు ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ వీటిని అధిక మొత్తంలో మాత్రం తినరాదు. తింటే వేడి చేస్తుంది. అలాగే విరేచనాలు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక మోతాదులో మాత్రమే ఈ పండ్లను తినాలి. ఈ పండ్లను తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కంటి చూపు మెరుగు పడుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఇంకా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.