Runny Nose : సాధారణంగా మనం రోజూ అనేక రకాల ఆహారాలను తింటుంటాం. కొందరికి తీపి అంటే ఇష్టంగా ఉంటుంది. కొందరు పులుపును ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాగే కొందరికి కారం ఉన్న ఆహారాలు అంటే ఇష్టంగా ఉంటుంది. అయితే ఎవరి అభిరుచులకు తగినట్లుగా వారు వివిధ రకాల ఆహారాలను తింటుంటారు. కానీ చాలా మందికి పులుపు లేదా కారంగా.. ఘాటుగా ఉన్న ఆహారాలను తింటుంటే లేదా తిన్న తరువాత ముక్కు నుంచి నీరు కారుతుంది. ఇలా చాలా మందికి జరుగుతుంది. అయితే ఇలా జరగడం హానికరమా.. దీని వెనుక ఉండే కారణాలు ఏమిటి.. ఇందుకు నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారు.. తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ ఆహారాలను అయినా తినేటప్పుడు ముక్కు నుంచి నీరు కారితే ఆ పరిస్థితిని వైద్య పరిభాషలో గస్టేటరీ రైనైటిస్ అని పిలుస్తారు. కొందరికి ఆహారం తినేటప్పుడు ఇలా జరిగితే.. కొందరికి ఆహారం తిన్నాక ముక్కు నుంచి నీరు కారుతుంది. అయితే పులుపు, కారం, ఘాటుగా ఉన్న ఆహారాలను తింటేనే ఇలా జరుగుతుంది. ఇలా జరిగేందుకు ప్రత్యేక కారణాలు ఏమీ ఉండవు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకున్నా సరే చాలా మందికి ఇలా జరుగుతుంది. ఇది చాలా సహజసిద్ధంగా జరిగే ప్రక్రియనే అని.. దీని వల్ల మనకు ఎలాంటి హాని కలగదని.. కనుక ఆహారం తినేటప్పుడు లేదా తిన్నాక ముక్కు నుంచి నీరు కారితే ఆందోళన చెందాల్సిన పనిలేదని.. నిపుణులు అంటున్నారు.
అయితే ఫుడ్ అలర్జీలు ఉన్నా కూడా ఇలాగే ముక్కు నుంచి నీరు కారుతుంది. కనుక ఫుడ్ అలర్జీలు ఉన్నవారు తమకు అలర్జీని కలిగించే ఆహారాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. లేదంటే ఇతర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. కనుక ఫుడ్ అలర్జీలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.