మీకు కిడ్నీ స్టోన్ల సమస్య ఉందా ? అయితే ఎందుకైనా మంచిది. ఒకసారి ఎముకలను కూడా చెక్ చేయించుకోండి. ఎందుకంటే.. కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవారికి ఎముకల సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ మేరకు బోన్ అండ్ మినరల్ రీసెర్చ్ అనే జర్నల్‌లో సైంటిస్టులు ఓ అధ్యయనానికి చెందిన వివరాలను ప్రచురించారు.
2007 నుంచి 2015 మధ్య 5,31,431 మంది కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్న వారిపై సైంటిస్టులు అధ్యయనం చేపట్టారు. వారిలో 23.6 శాతం మందికి ఎముకల సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా ఆస్టియో పోరోసిస్ లేదా ఎముకలు గుల్లబారి విరిగిపోవడం వంటి సమస్యల బారిన పడినట్లు నిర్దారించారు. అందువల్ల కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవారు తమ ఎముకల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.
ఇక కిడ్నీ స్టోన్స్ సమస్య ఇప్పటికే ఉన్నవారు మాత్రమే కాకుండా, కొత్తగా ఆ వ్యాధి బారిన పడ్డవారు కూడా ఎముకలను పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఆరంభంలో ఎముకల సమస్యను గుర్తిస్తే తగిన చికిత్స తీసుకుని సమస్య తీవ్రతరం కాకుండా చూసుకోవచ్చని తెలిపారు.