మన శరీరంలో ప్రవహించే రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ లెవల్స్ సరిగ్గా లేకపోతే అది మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా గుండె జబ్బులు వస్తాయి. హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. గుండెకు అనుసంధానమై ఉండే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతే నాళాలు ఇరుకుగా మారుతాయి. దీంతో రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా గుండె అనారోగ్యం బారిన పడుతుంది. అలాగే శరీరంలో ఇతర భాగాల్లో కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోకుండా అశ్రద్ధ చేస్తే.. హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచాలంటే నిత్యం ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించడంతోపాటు ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి. ఇక ఆహారం విషయానికి వస్తే కొలెస్ట్రాల్‌ను తగ్గించే పలు సూపర్ ఫుడ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఉల్లిపాయలు కూడా ఒకటి. వీటిని సాధారణంగా మనం నిత్యం వంటల్లో వాడుతాం. కానీ ఇవి మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగలవని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది.
సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం.. మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్‌ను ఉల్లిపాయలు తగ్గిస్తాయని వెల్లడైంది. ఉల్లిపాయల్లో ఫ్లేవనాయిడ్స్ అనబడే పాలిఫినాలిక్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. ఫ్లేవనాయిడ్స్ సహజంగానే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల జాబితాకు చెందుతాయి. యాంటీ క్యాన్సర్ ధర్మాలను కూడా కలిగి ఉంటాయి. ఈ క్రమంలో బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఉల్లిపాయల్లో ఉండే ఫ్లేవనాయిడ్స్ మన శరీరంలో ఉండే లో డెన్సిటీ లిపోప్రోటీన్ (Low-Density Lipoprotein) లేదా ఎల్‌డీఎల్ (LDL) అనే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయని తేలింది. ఈ ఎల్‌డీఎల్ శరీరంలో ఎక్కువగా పేరుకుపోతే గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
ఇక ఫుడ్ అండ్ ఫంక్షన్ అనే మరో జర్నల్‌లో ప్రచురితమైన మరొక అధ్యయనం ప్రకారం.. ఎర్ర ఉల్లిపాయలు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయని వెల్లడైంది. ఈ క్రమంలో పచ్చి ఉల్లిపాయలను నిత్యం తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. పచ్చి ఉల్లిపాయలను మనం సలాడ్లు, శాండ్ విచ్‌లు, ఇతర ఆహారాల్లో తినవచ్చు. లంచ్ లేదా డిన్నర్‌లో వీటిని నేరుగా తీసుకోవచ్చు. మన దేశంలో చాలా మంది మజ్జిగ లేదా పెరుగులో పచ్చి ఉల్లిపాయ ముక్కలను వేసి కూడా తింటుంటారు. అలా తిన్నా శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365