డయాబెటీస్ రోగులకు నిద్ర సరిగా వుండదు. దీనికి కారణం రక్తంలో షుగర్ అధికంగా వుండటం. వీరి ఆహారం అధిక కేలరీలతో కూడినదై వుండటం, వీరు అధిక బరువు, మందకొడి జీవన విధానం కలిగి వుండటంతో వీరికి నిద్ర కూడా సరిగా వుండదని ఒక తాజా అధ్యయనం చెపుతోంది. రాత్రివేళ ఆరు గుంటలకంటే తక్కువ నిద్రిస్తే, వారిలో డయాబెటీస్, గుండె జబ్బు వచ్చే అవకాశాలు మూడు రెట్లు అధికం అని న్యూయార్క్, బఫెలో స్టేట్ యూనివర్శిటీ మరియు వార్విక్ మెడికల్ స్కూల్ కలసి చేసిన ఒక అధ్యయనం తెలిపినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించింది.
తక్కువగా నిద్రిస్తున్నారంటే ఇక మీకు డయాబెటీస్ వచ్చే సూచనలున్నట్లేనట. ఈస్ధితిలో శరీరంలో గ్లూకోజ్ నియంత్రణ సరిగా వుండదు. టైప్ 2 డయాబెటీస్ మరియు గుండెజబ్బులు, లేదా పోటు వచ్చే అవకాశం వుంటుంది.
ఈ స్టడీలో 1455 మంది పాల్గొన్నారు. ఆరు సంవత్సరాలపాటు ఈ స్టడీని వెస్ట్రన్ న్యూయార్క్ హెల్త్ స్టడీ రికార్డు చేసింది. ఇందులో పాల్గొన్న వారి వయసు 35 – 79 సంవత్సరాలవరకు వున్నది. స్టడీ ఫలితాలను అన్నాల్స్ ఆఫ్ ఎపిడెమియాలజీ అనే జర్నల్ లో ప్రచురించారు.