ఆరోగ్యంగా ఉండడం కోసం చాలా మంది రోజూ వాకింగ్ చేస్తుంటారు. ఎవరి సౌకర్యానికి అనుగుణంగా వారు వాకింగ్ చేస్తుంటారు. అయితే రోజుకు 7000 అడుగుల దూరం నడిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ మేరకు కొందరు సైంటిస్టులు 10 ఏళ్ల సుదీర్ఘ అధ్యయనం అనంతరం ఈ వివరాలను వెల్లడించారు.
గతంలో రోజుకు 10,000 అడుగుల దూరం నడవాలని ఒక నియమం పెట్టారు. అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ రోజుకు 7,000 అడుగుల దూరం నడిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చని సైంటిస్టులు తాజాగా వెల్లడించారు.
అమెరికాకు చెందిన కొందరు సైంటిస్టులు 10 ఏళ్ల పాటు 2100 మందిపై అధ్యయనం చేపట్టారు. వారందరూ 40 ఏళ్లకు పైబడి వయస్సు ఉన్నవారే. అయితే వారిలో రోజుకు 7,000 అడుగులు అంతకన్నా ఎక్కువ దూరం నడిచిన వారిలో త్వరగా చనిపోయే అవకాశాలు 60 నుంచి 70 శాతం వరకు తగ్గాయని గుర్తించారు. అలాగే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గిందని తేల్చారు.
అందువల్ల రోజూ ఎవరైనా సరే రోజుకు 7000 అడుగుల దూరం నడిస్తే చాలని, 10,000 అడుగుల దూరం నడవాల్సిన పనిలేదని సైంటిస్టులు చెబుతున్నారు.