Arudra Purugulu : వర్షాకాలంలో మనం అనేక రకాల కీటకాలు, పురుగులను చూడవచ్చు. వర్షాకాలంలో మాత్రమే కొన్ని రకాల పురుగులు మనకు కనిపిస్తాయి. అలాంటి వాటిలో ఆరుద్ర పురుగులు ఒకటి. పూర్వకాలంలో ఈ పురుగుల సంఖ్య ఎక్కువగా ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో ఇవి అంతరించే దశకు వచ్చాయి. ఆరుద్ర కార్తె నక్షత్రాలలో ఆరవది. ఈ కార్తె రాగానే రైతులు వ్యవసాయ పనులను ప్రారంభిస్తారు. ఈ కార్తెలో మాత్రమే మనకు ఆరుద్ర పురుగులు కనిపిస్తాయి. వీటిని కుంకుమ పురుగులు, చందమామ పురుగులు అని కూడా అంటారు. వీటిని ఇంగ్లీష్ లో రెయిన్ బగ్స్, రెడ్ వెల్వెట్ మైట్స్ అని అంటారు. ఇవి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కనిపిస్తాయి. ఈ పురుగులంటే శివుడికి ఎంతో ఇష్టమని చాలా మంది భావిస్తారు.
కొన్ని ప్రాంతాలలో వీటిని లక్ష్మీ దేవి గా భావించి పూజిస్తుంటారు కూడా. ఆరుద్ర పురుగులు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఇవి పంటలకు ఎటువంటి హాని చేయవు. వీటిని చూడడాన్ని రైతులు శుభ సూచకంగా భావిస్తారు. వీటిని చూడడం వల్ల ఏడాదంతా మంచి జరుగుతుందని పూర్వం రైతులు భావించే వారు. ఈ పురుగులను పర్యావరణ నేస్తాలని అంటారు. మొక్కలు నేలలో ఉండే పోషకాలను గ్రహించేలా ఈ పురుగులు నేలను సారవంతం చేసి రైతులకు ఎంతో మేలు చేస్తాయి. ఆరుద్ర పురుగులు భూ సారాన్ని పెంచుతాయి. పూర్వకాలంలో ఈ పురుగులతో చిన్న పిల్లలు ఆడుకునే వారు. ఈ పురుగులు ముట్టుకోగానే ముడుచుకు పోతాయి. ఈ పురుగులను రైతు నేస్తాలు అని అంటారు. ఈ పురుగులు కనిపిస్తే ఆ సంవత్సరం వర్షాలు బాగా కురుస్తాయని రైతులు విశ్వసిస్తారు.
వీటిని వరుణ దేవుడికి ప్రతి రూపంగా చాలా మంది భావిస్తారు. ఈ ఆరుద్ర పురుగులు భూమిలో 40 అడుగుల లోతు వరకు నివసిస్తాయి. ఈ పురుగులు భూమి లోపల ఎక్కువ కాలం నివసిస్తాయి. వర్షం పడగానే ఈ పురుగులు బయటకు వస్తాయి. ఆరుద్ర పురుగులపై కొన్ని సామెతలు కూడా పూర్వపు రోజులల్లో వాడుకలో ఉండేవి. ఈ పురుగుల నుండి తీసిన నూనెను కొన్ని ప్రాంతాలలో పక్షవాతానికి ఔషధంగా, పురుషులల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఔషధంగా వాడతారు. కానీ ప్రస్తుత కాలంలో ఈ పురుగులు అంతరించే దశకు వచ్చాయి.
పంటలకు రసాయనాలను, కృత్రిమ ఎరువులను, పురుగు మందులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆరుద్ర పురుగులు అంతరించే దశకు చేరుకున్నాయి. గుంపులు గుంపులుగా కనిపించే ఈ పురుగులు ప్రస్తుత కాలంలో ఒక్కటి కూడా కనిపించడం లేదు. మనలో చాలా మంది వీటితో ఆడుకునే ఉంటారు. అంతరించి పోతున్న పురుగుల జాబితాలో ఇవి కూడా చేరి పోయాయని చాలా మంది విచారం వ్యక్తం చేస్తున్నారు.