Edu Varala Nagalu : బంగారు ఆభరణాలను ధరించడం అంటే మహిళలకు ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఈ క్రమంలోనే వారు రకరకాల ఆభరణాలను ధరించేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే మనకు ఏడు వారాల నగలు అనే మాటలు తరచూ వినిపిస్తుంటాయి. దీని గురించి తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. అయితే.. అసలు ఇంతకీ ఏడు వారాల నగలు అంటే ఏమిటి ? వీటిని ఎప్పుడు ధరిస్తారు ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో తమకు ఉన్న గ్రహాల పీడకు అనుగుణంగా చాలా మంది రంగు రంగుల ఉంగరాలను ధరిస్తుంటారు. అలాగే వారం రోజుల్లో ఒక్కో గ్రహం అనుగ్రహం కోసం మహిళలు ఏడువారాల నగలు ధరిస్తుంటారు. దీంతో ఆయా గ్రహాల దోషాలు పోతాయని భావిస్తుంటారు.
ఇక ఆదివారం రోజు సూర్యుని కోసం కెంపుల కమ్మలు, హారాలు ధరిస్తారు. అదే సోమవారం అయితే చంద్రుడి కోసం ముత్యాలతో చేసిన హారాలు, గాజులను ధరిస్తుంటారు. అదే మంగళవారం అయితే కుజుడి కోసం పగడాల దండలు, ఉంగరాలను ధరిస్తారు.
బుధవారం బుధుడి కోసం పచ్చల పతకాలు, గాజులను, గురువారం బృహస్పతి కోసం పుష్యరాగము, కమ్మలు, ఉంగరాలను ధరిస్తారు. శుక్రవారం రోజు శుక్రుని అనుగ్రహం కోసం వజ్రాల హారాలు, వజ్రపు ముక్కు పుడక, ఉంగరాలను ధరిస్తారు. శనివారం శని కోసం నీలమణి హారాలను ధరిస్తారు. ఇలా ఏడు రోజుల్లోనూ ఆయా గ్రహాలకు అనుగుణంగా భిన్న రకాల ఆభరణాలను ధరిస్తుంటారు. వాటన్నింటినీ కలిపి ఏడువారాల నగలు అంటారు. వాటిని ధరించడం వల్ల గ్రహ దోషాలు పోతాయని, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలుగుతాయని నమ్ముతారు.