యూఏఈ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మహిళల జట్టు బోణీ కొట్టింది. స్కాట్లండ్‌పై 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లా జట్టు నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కూడా స్కాట్లండ్ ఛేదించలేకపోయింది. ఎప్పటికప్పుడు వికెట్లను కోల్పోతూ వచ్చింది. దీంతో పరాజయం పాలైంది.
మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకోగా నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ఆ జట్టు ప్లేయర్లలో శోబన మొస్తరి 36 పరుగులతో రాణించింది. అలాగే షాతి రాణీ 29 పరుగులు చేసింది. స్కాట్లండ్ బౌలర్లలో సస్కియా హోర్లీ 3 వికెట్లు తీయగా, కేథరిన్ ఫ్రేజర్, ఒలివియా బెల్, కాథరిన్ బ్రైస్ తలా 1 వికెట్ పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన స్కాట్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 103 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టు ప్లేయర్లలో సారా బ్రైస్ మాత్రమే 49 పరుగులు చేసి రాణించింది. మిగిలిన ఎవరు ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. ఇక బంగ్లా బౌలర్లలో రితు మోని 2 వికెట్లు తీయగా, రబేయా ఖాన్, ఫహిమా ఖతున్, నహిదా అక్తర్, మరుఫా అక్తర్‌లకు తలా 1 వికెట్ దక్కింది.