ఇటీవలే న్యూజిలాండ్‌తో ముంబైలో జరిగిన 3వ టెస్టు మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కేవలం 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో భారత్ ఇంటా, బయట విమర్శలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు సీనియర్ ప్లేయర్లు అయిన కోహ్లి, జడేజా, అశ్విన్‌లను నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. స్పిన్‌ను ఎందుకు సరిగ్గా ఆడలేకపోతున్నారంటూ విమర్శిస్తున్నారు. అయితే మూడో టెస్టులో రిషబ్ పంత్‌ను ఔట్‌గా ప్రకటించడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
రిషబ్ పంత్ బంతి తన ప్యాడ్‌కు తగిలిందని వాదించినా కూడా ఫలితం లేకపోయింది. అంపైర్లు అతన్ని ఔట్‌గా ప్రకటించారు. అప్పటికే క్రీజులో పాతుకుపోయి ఉన్న పంత్ ఔటయ్యే సరికి టీమిండియా వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది. దీంతో ఓటమి పాలైంది. అయితే హాట్ స్పాట్ టెక్నాలజీ అందుబాటులో ఉంటే బంతి అసలు సరిగ్గా ఎక్కడ తగిలిందో తెలిసి ఉండేదని కామెంటేటర్లు కూడా వ్యాఖ్యానించారు. అయితే బీసీసీఐ ఈ హాట్‌స్పాట్ టెక్నాలజీని అసలు ఎందుకు ఉపయోగించడం లేదు.. అన్న విమర్శలు కూడా వచ్చాయి. అయితే భారత మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే స్పందిస్తూ హాట్ స్పాట్ టెక్నాలజీ అన్నది కేవలం మిలిటరీ వాళ్లకేనని చెప్పారు.
భారత్‌లో హాట్ స్పాట్ టెక్నాలజీని కేవలం మిలిటరీ వాళ్లే వాడుతారని, వేరే వాళ్లకు అనుమతి లేదని అన్నారు. అంతే కాకుండా హాట్ స్పాట్ టెక్నాలజీని వాడితే చాలా ఖర్చు వస్తుందట. ఆస్ట్రేలియాలో ఇప్పటికే ఈ టెక్నాలజీని వాడుతున్నారు. కానీ దీన్ని ఐసీసీ ఇంకా డెసిషన్ రివ్యూ సిస్టమ్‌లోకి అనుమతించలేదు. కనుక బీసీసీఐ కూడా ఈ టెక్నాలజీని వాడడం లేదు. కానీ ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఇప్పటికైనా హాట్ స్పాట్ టెక్నాలజీని వాడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.