సాధారణంగా మనం క్రికెట్‌లో ఎవరైనా ప్లేయర్ 0 (సున్నా) పరుగులకే ఔటైతే డక్ అవుట్ అయ్యాడు.. అని అంటుంటాం కదా.. క్రికెట్ భాషలో ఈ పదం వాడడం చాలా కామన్. కామెంటేటర్లు కూడా ఎవరైనా ప్లేయర్ సున్నా పరుగులకే ఔటైతే ఆ ప్లేయర్‌ను డకౌట్ అయ్యాడు అని అంటుంటారు. అయితే డక్ అంటే ఇంగ్లిష్‌లో బాతు అని అర్థం వస్తుంది కదా. మరి ఆ పదం క్రికెట్‌లోకి ఎలా వచ్చింది ? అసలు సున్నా పరుగులకే ఔట్ అయితే డక్ అవుట్ అని ఎందుకంటారు ? అసలు ఇలా అనడం ఎప్పటి నుంచి ప్రారంభమైంది ? ఇవే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
క్రికెట్‌లో ఎవరైనా ప్లేయర్ సున్నా పరుగులకే ఔట్ అయితే మొదట్లో డక్స్ ఎగ్ అవుట్ అని అనడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే వాడుకలో ఆ పదం డక్ అవుట్ అయింది. ఇక డక్స్ ఎగ్ అవుట్ అనే ఎందుకు అనడం మొదలు పెట్టారంటే.. డక్ అంటే బాతు గుడ్డు 0 (సున్నా) ఆకారంలో ఉంటుంది కదా. అందుకే 0 పరుగులు చేస్తే బాతు గుడ్డును పోలి ఆ అంకె ఉంటుంది కనుక బాతు గుడ్డుతో పోలుస్తూ డక్స్ ఎగ్ అవుట్ అని అనడం మొదలు పెట్టారు. అయితే ఈ పదాన్ని మొదట 1886లో వాడారు. అప్పట్లో వేల్స్ యువరాజు క్రికెట్ మ్యాచ్ ఆడుతూ.. సున్నా పరుగులకే ఔటయ్యాడు. దీంతో ఓ పత్రిక అతని స్కోర్‌ను బాతు గుడ్డు (0 – సున్నా)తో పోలుస్తూ ఓ కథనాన్ని రాసింది. అందులో సున్నా స్కోర్‌ను డక్స్ ఎగ్ అవుట్ అని రాశారు. అంతే.. అప్పటి నుంచి ఆ పదం ఫిక్సైంది. దీంతో ఎవరు సున్నా పరుగులు చేసినా డక్ అవుట్ అయ్యాడు.. అని అనడం మొదలు పెట్టారు.
అయితే క్రికెట్‌లో ఎవరైనా ప్లేయర్ తాను ఆడిన మొదటి బంతికే పరుగులేమీ చేయకుండా ఔట్ అయితే దాన్ని గోల్డెన్ డక్ అని అంటారు. అలాగే పరుగులు ఏమీ చేయకుండానే రెండు, మూడు బంతుల్లో ఔట్ అయితే వాటిని సిల్వర్, బ్రాంజ్ డక్స్ అని వ్యవహరిస్తారు. ఇక మ్యాచ్‌లో బాల్స్‌ను ఆడకుండా, పరుగులు ఏమీ చేయకుండా రనవుట్ అయితే దాన్ని డైమండ్ డక్ అంటారు. ఇక ఒక ప్లేయర్ తాను మ్యాచ్‌లో ఆడే మొదటి బాల్‌కు లేదా ఆ సీజన్‌లో ప్లేయర్ టీం ఆడే మొదటి మ్యాచ్ మొదటి బాల్‌కు పరుగులు ఏమీ చేయకుండా అవుట్ అయితే దాన్ని పల్లాడియం డక్ అని పిలుస్తారు. ఇదీ.. క్రికెట్‌లో డకవుట్‌కు ఉన్న స్టోరీ.. ఆసక్తిగా ఉంది కదూ..!