ఈ రోజుల్లో సెల్ ఫోన్‌లేని అర్భక జీవి భూమ్మీద ఇంకా తిరుగుతున్నాడంటే నమ్మ శక్యంగా ఉండదు మరి. అలాంటి సెల్ అనబడే దిల్ కీ దడ్ ఖన్ ని హృదయం కంటే పదిలంగా ఉంచుకుతీరాలి. మన గుండె కాయ స్థానాన్ని అది ఆక్రమించిoది నిజమే, కాని దాని గుండె , దానిలోఉన్న బ్యాటరీనే కదా. అందుచేత, అందువలన, దాన్ని కాపాడుకోవటం, మనజేబు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ ఇస్తున్న వివరాలు సార్వత్రికంగా అన్ని సెల్ ఫోన్లకి అని విన్నపం. వీటిలో బాగా హైఎండ్ ఫోన్లలో ఉండే రక్షకచర్యల గురించి ఎక్కువ రాయడం లేదు. అలాగే నేను ఒక సెల్ ఫోన్ వినియోగదారుడినే. నాకు ఎలాంటి సెల్ ఫోన్ మెకానిజం తెలీదు. కేవలం చదివి తెలుసుకుని రాస్తున్నవే కనుక క్రింద ఇచ్చిన అక్షరాలను పరిశీలించి కామెంట్ చేయప్రార్ధన.
చాలావరకు, ఫోన్ బాటరీలు లిథియంఅయాన్ తో తయారైనవే ఉంటాయి. వీటి పనితనం ఛార్జింగ్ సైకిల్స్ తో కొలుస్తారు. ఒక ఛార్జింగ్ సైకిల్ అంటే సున్నా నుంచి వంద వరకు ఛార్జి అవడం. అయితే ఇలా ప్రతిసారి అవదుకదా. కొన్ని సార్లు సున్నానుంచి అరవై దాకా ఛార్జి పెట్టి మళ్లీ సున్నా నుంచి నలభై దాకా ఛార్జి అయినా, అది ఒక సైకిలే అవుతుంది. బ్యాటరీ కి తక్కువ ఓల్టేజ్ లో 65 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఆపైన అంటే ఎరుపు రంగులో ఉండే ఛార్జ్ అంతా ఎక్కువ ఓల్టేజ్ లోనే. ఇది హాని చేసేది గా ఉంటుంది. అంటే తక్కువగా ఛార్జింగ్ ఎక్కువ సార్లు మంచిది. మొత్తం ఒకేసారి మంచిది కాదు. నిజ పరిస్థితుల్లో మన అందరికీ ఉన్న ఒక చెడ్డ అలవాటు ఏమంటే, పూర్తిగా ఐదోపదో శాతం ఉండే వరకూ వాడేసి, ఆ పైన వంద దాకా ఛార్జి చేయటం. ఇది బాటరీ ని బలహీనం చేస్తుంది. అంటే మనం నిరంకుశ యజమాని లా, దాన్ని పూర్తిగా అలిసి పోయేలా పనిచేయిస్తున్నామన్నమాట.
బ్యాటరీ ఎక్కువ కాలం రావాలంటే 40 డిగ్రీ కంటే తక్కువ ఉష్ణోగ్రత లోనే ఉండాలి. బ్యాటరీకి, రెండోపెద్ద శత్రువు వేడి. మన సెల్ వేడి ఎక్కిన కొద్దీ , అది పనిచేసే శక్తిని త్వరగా కోల్పోతుందని గుర్తించాలి. బ్యాటరీ ,అలాగే సెల్, మరింత కాలం పని చేయాలంటే, ఇవిగో ఈ సూత్రాలు పాటించటం ఉత్తమం. బ్యాటరీ 20% కంటే తక్కువ రాకముందే ఛార్జింగ్ కి పెట్టండి.ఎప్పుడూ 20-8O% ల మధ్య ఛార్జింగ్ మీ ఫోన్ ను ఆరోగ్యంగా ఉంచుతుందని తెలుసుకోండి. 90% కంటే ఎక్కువ ఛార్జి చేస్తే అది ఫోన్ బ్యాటరీ పనితీరుని క్రమేపీ దెబ్బతీస్తుంది. వేగవంతమైన ఛార్జింగ్ ,మనకెంతో సౌకర్యం అయినప్పటికీ,తొందరగా చేసేపని ఏదైనా, కొన్ని పరిమితులకు లోబడే ఉంటుంది. అంటే అది బ్యాటరీ పనితనానికి దెబ్బే. హడావిడిలేకపోతే, అప్పుడప్పుడూ స్లో ఛార్జింగ్ వాడండి. రాత్రంతాఛార్జింగ్ చేయడం మానండి. కొన్ని ఫోన్లలో ఆప్టిమైజ్డ్ నైట్ ఛార్జింగ్ ఉంటుంది. నా వన్ ప్లస్ ఫోన్ లో అది ఉంది. దానంతట అదే ఛార్జింగ్ రాత్రంతా ఆపేసి మళ్లీ పొద్దున మొదలు పెడుతుంది. ఇలా ఉంటే సరే.
ఎల్లప్పుడూ కంపెనీ ఇచ్చిన చార్జర్నే వాడండి . డబ్బుతక్కువ అని వందకీ రెండొందలకీ దొరికే దిక్కుమాలిన చైనా చార్జర్ వాడొద్దు. ఛార్జర్ కేబుల్ కూడా దానిలో భాగమే , అది కూడా మీరు కొన్న సెల్ ఫోన్ కంపెనీదే వాడాలి. అతి చల్లదనం,అతి వేడి ఉండేచోట సెల్ పెట్టకండి. అంటే కిచెన్ లో , ఫ్రిజ్ లోపల (జస్ట్ ఛిల్) అని కాదు , వేడిగా,చల్లగా ఉండే ప్రదేశాల్లో అని అంతరార్థం. మీరు వాడనపుడు, ఇంకేదో పనిలో ఉంటే, సెల్ ను బాటరీ సేవర్ మోడ్ లో పెట్టండి. వాడని యాప్ లు అన్నీ వెతికి సంహరించండి, అంటే అన్ ఇన్ స్టాల్ చేయమని, నా కవి హృదయం. సెల్ వేడెక్కే దాకా గేమ్ లు గట్రా ఆడుతుంటే, బాటరీ మటాష్ అవుతుందని అర్ధం. సెల్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు, వాడకుండా ఉండటం ఉత్తమం. అమోలెడ్ తెర ఉన్న సెల్ ఫోన్ లలో, స్క్రీన్ సేవర్ కోసం, నల్ల రంగు బొమ్మలు పెట్టుకుంటే బాటరీ కి కొంత ఆదా చేసినట్టే. ఎందుకంటే స్క్రీన్ పైఉన్న LED లు చాలవరకు వెలగక ఛార్జింగ్ అదా అవుతుంది.
అసలు డిస్ ప్లే కే బోల్డంత శక్తి అవసరం. వీలైతే 100% తెర ప్రకాశాన్ని(screen Brightness) తగ్గించండి. అలాగే ఆటోమాటిక్ గా మారే ఎంపిక ఎంచుకోవద్దు. ఇందులో సెన్సర్లు పనిచేసి బ్యాటరీ లోంచి శక్తి వృధా అవుతుంది. మాన్యువల్ గానే మార్చటం మంచిది. ఊరికూరికే, అప్‌డేట్ ఇవ్వగానే ,ఇన్ స్టాల్ చేయకండి. పూర్తిగా తప్పులన్నీ సవరించారని నిర్దారించుకుని, అపుడు చేసుకున్నా ఏమీ మునిగి పోదు. ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విట్టర్, వాట్సాప్ ఇలాంటివి, ఉన్న బ్యాటరీ శక్తిని, స్ట్రా వేసుకుని, పీల్చేస్తాయి. అవసరం లేనపుడు ఆ యాప్ ఆపేయండి. ఆటో స్క్రీన్ ఆఫ్ ( Auto screen off) ఒకనిముషం లోపలే ఉండేట్టు చూసుకోండి. ఇంకా బ్యాటరీ ఎక్కువ వాడే యాప్ లను ఆప్టిమైజ్ అనే ఎంపిక ద్వారా ఆపేయవచ్చు. బేక్ గ్రౌండ్ లో పనిచేస్తూ ఉండే యాప్ లని ఆపేయండి. ఛార్జ్ చేసేటప్పుడు వేడెక్కితే పైన వేసిన గొంగళి లాంటి కవర్ తీసేయండి. కాసేపు దాన్ని గాలి పీల్చుకునేందుకు వదలండి.