ఒకప్పుడు సెల్‌ఫోన్‌లో కెమెరా ఉంటే గొప్ప… అదీ కెమెరాకు ఫ్లాష్ ఉంటే… ఇక దాని పనితీరు ఎలా ఉండేదో మనం వేరే చెప్పాల్సిన పనిలేదు. హై రేంజ్ సెల్‌ఫోన్లలో మాత్రమే ఫ్లాష్‌తో కూడిన కెమెరాలు ఉండేవి. అయితే ఇప్పుడలా కాదు. ఫోన్ చిన్నదైనా, పెద్దదైనా… ఫ్లాష్ తప్పనిసరి. కొన్ని కంపెనీలు ఫ్రంట్ ఫ్లాష్‌తో కూడిన ఫోన్‌లను వినియోగదారులకు అందిస్తున్నాయి. ఇదంతా సరే… ఈ మధ్య కాలంలో అయితే వెనుక భాగంలో రెండు కెమెరాలు కలిగిన ఫోన్లు కూడా వస్తున్నాయి, గమనించారు కదా. యాపిల్ విడుదల చేస్తున్న ఐఫోన్లతోపాటు ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ వెనుక భాగంలో రెండు కెమెరాలు ఉంటున్నాయి. అయితే… వాస్తవంగా చెప్పాలంటే ఫోన్‌కు వెనుక ఒక కెమెరా, ముందు ఒక కెమెరా చాలు కదా… మరి వెనుక భాగంలో రెండు కెమెరాలు ఎందుకు..? వాటి అవసరం ఏమిటి..? అన్నదాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
ఫోన్లలో డ్యుయల్ రియర్ కెమెరాలను అందించడం వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటంటే… ఎటొచ్చీ యూజర్లకు నాణ్యమైన ఫొటోలు, వీడియోలను అందించడమే. ఈ క్రమంలో ఫోన్ వెనుక భాగంలో ఉండే రెండు కెమెరాల్లో ఒక్కోటి ఒక్కో సామర్థ్యం కలిగి ఉంటుంది. లేదంటే రెండూ ఒకే పిక్సల్స్ సెన్సార్స్ అయి కూడా ఉండవచ్చు. అయితే వాటిలో ఒక కెమెరా ఇమేజ్‌లోని ఎరుపు, ఆకుపచ్చ, నీలి రంగులను గుర్తించి ప్రాసెస్ చేస్తుంది. మరో కెమెరా ఇమేజ్‌లోని నలుపు, తెలుపు రంగుల్ని మరింత లోతుగా గుర్తించి ప్రాసెస్ చేస్తుంది. దీన్నే డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటారు. ఇలా ప్రాసెస్ అవడం వల్ల ఫొటోలు అత్యుత్తమ క్వాలిటీతో వస్తాయి.
అదేవిధంగా ఫోన్‌కు వెనుక భాగంలో ఉండే రెండు కెమెరాల్లో ఒకటి నార్మల్ (డిజిటల్) జూమ్ ఇస్తే, మరొకటి 1ఎక్స్ రేంజ్‌లో ఆప్టికల్ జూమ్ ఇస్తుంది. దీంతో ఒక స్టెప్ జూమ్ వేసినా ఫొటోలు, వీడియోలు పగిలిపోవు. క్వాలిటీతో వస్తాయి. ఇక రెండు కెమెరాలను వెనుక భాగంలో అందించడం వెనుక ఉన్న ఇంకో ఉద్దేశమేమిటంటే… ఎఫ్ నంబర్. రెండు కెమెరాలకు ఉండే ఎఫ్ నంబర్ వేర్వేరుగా ఉంటుంది. దీంతో విభిన్నమైన రిజల్యూషన్లు కలిగిన ఫొటోలు, వీడియోలను తీసుకోవచ్చు. కెమెరా షటర్ స్పీడ్ వేగంగా ఉంటుంది. అంటే స్నాప్ కొట్టే కొద్దీ ఫొటోలు వేగంగా వస్తూనే ఉంటాయి. మధ్యలో ఎక్కడా ఆగిపోవడం ఉండదు.
దీనికి తోడు ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయి ఉన్న కెమెరా యాప్ కూడా వేగంగా ఓపెన్ అవుతుంది. దీంతో సెకన్ల వ్యవధిలోనే ఫొటోలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. రెండు రియర్ కెమెరాలు ఉండడం వల్ల ఆ ఫోన్‌తో తీసిన ఫొటోలు దాదాపుగా డీఎస్ఎల్ఆర్ కెమెరా క్వాలిటీకి సమానంగా వస్తాయి. అందుకే ఇటీవలి కాలంలో వస్తున్న ఫోన్లకు వెనుక భాగంలో రెండు కెమెరాలను అందిస్తున్నారు..! కనుక మీరు కూడా ఏదైనా ఫోన్‌ను కొనే ముందు అందులో డ్యుయల్ రియర్ కెమెరాలు ఉన్నాయో లేదో చూసుకుని కొనుగోలు చేయండి..!