Medi Chettu : మేడి చెట్టు.. దీనినే ఔదంబర వృక్షం, దత్తాత్రేయ వృక్షం అని పూజించే సంప్రదాయం పూర్వకాలం నుండి ఉంది. కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు. మహా ఆయుర్వేద సంపద కూడా ఈ మేడి చెట్టులో ఉంది. ఈ మేడి చెట్టును చాలా సులువుగా పెంచుకోవచ్చు. దీనిని సంస్కృతంలో ఉదుంబర, క్షీర వృక్ష అని, హిందీలో గులర్ అని పిలుస్తుంటారు. మేడి చెట్టు వగరు రుచిని కలిగి ఉంటుంది. మేడి చెట్టు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చెట్టును ఉపయోగించి అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. స్త్రీలల్లో వచ్చే యోని రోగాలను, ఉబ్బు రోగాలను, సర్ఫిని, వ్రణాలను, పైత్యాన్ని, అతి మూత్ర వ్యాధిని, రక్త పైత్యాన్ని తగ్గించడంలో మేడి చెట్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. మేడి చెట్టు లేత ఆకుల పొడిని అర టీ స్పూన్ నుండి ఒక టీ స్పూన్ మోతాదులో తేనెతో కలిపి రెండు పూటలా తీసుకుంటూ ఉంటే పైత్య రోగాలు తగ్గుతాయి.
గవద బిళ్లలను, శరీరంలో వచ్చే కణతులను తగ్గించే శక్తి మేడి చెట్టు పాలకు ఉంది. గవద బిళ్లలు లేదా కణతులు వచ్చినప్పుడు మేడి చెట్టు దగ్గరకు వెళ్లి నమస్కరించి మన బాధను చెప్పుకుని ఆ చెట్టుకు గాటు పెట్టి ఆ గాటు నుండి వచ్చే పాలను గవద బిళ్లలపై, కణతులపై దట్టంగా పూసి వాటిపై దూదిని ఉంచాలి. ఇలా చేయడం వల్ల గవద బిళ్లలు, కణతులు తగ్గుతాయి.
మేడి పళ్ల కషాయాన్ని కానీ, రసాన్ని కానీ తాగడం వల్ల అధిక దాహం సమస్య తగ్గుతుంది. మేడి చెక్క రసాన్ని కానీ, కషాయాన్ని కానీ నోట్లో పోసుకుని 10 నిమిషాల పాటు పుక్కిలించి ఉమ్మి వేయడం వల్ల నోటి పూత తగ్గుతుంది. మేడి చెట్టు వేరును నీటితో కలిపి మెత్తగా నూరి అరి కాళ్లకు రాయడం వల్ల సుఖ ప్రసవం జరుగుతుంది. మేడి చెట్టుకు పూజ చేసి తిథి ప్రకారంగా ఈ చెట్టు వేరును కానీ చిన్న మొక్కను కానీ తెచ్చుకుని పసుపు, కుంకుమ చల్లి నీడలో ఎండబెట్టి దానిని వెండి లేదా రాగి తాయత్తులో ఉంచి మెడకు కానీ మొలకు కానీ కట్టుకోవడం వల్ల మానసిక బలహీనత తగ్గి ధైర్యంగా తయారవుతారు. ఇలా చేయడం వల్ల.. ధన నష్టం కలిగిన వారికి మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా తిరిగి ధనాన్ని సంపాదించుకునే శక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
స్త్రీలలో నెలసరి సమయంలో వచ్చే అతి రక్తస్రావం సమస్యను తగ్గించడంలో కూడా మేడి చెట్టు ఉపయోగపడుతుంది. మేడి చెట్టు కాయలను కట్ చేసి ఎండబెట్టి పొడిలా చేసుకోవాలి. 100 గ్రా., మేడి కాయల పొడికి 100 గ్రా. పటిక బెల్లం పొడిని, 50 గ్రా. తేనెను కలిపి నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 10 గ్రా. చొప్పున తీవ్రతను బట్టి రెండు లేదా మూడు పూటలు తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అధిక రక్తస్రావం సమస్య తగ్గుతుంది.
మేడి కాయలను, మోదుగ పువ్వులను సమపాళ్లలో కలిపి నువ్వుల నూనెతో మెత్తగా నూరాలి. ఈ మిశ్రమానికి కొద్దిగా తేనెను కలిపి రాత్రి పూట యోనికి లేపనంగా రాసుకుంటూ ఉంటే యోని బిగువుగా తయారవుతుంది. మేడి చెట్టు బెరడు పొడి, మర్రి చెట్టు లేత ఆకుల పొడి, పటిక బెల్లం పొడిని సమపాళ్లలో కలిపి పూటకు 10 గ్రా.ల చొప్పున రెండు పూటలా తీసుకుంటూ.. వెంటనే వేడి పాలను తాగడం వల్ల పురుషులల్లో వీర్య నష్టం తగ్గి, వీర్యం గట్టి పడడంతోపాటు సంభోగ శక్తి కూడా పెరుగుతుంది.
మేడి పండ్లల్లో ఉండే గింజలను తీసి ఎండబెట్టి పొడిలా చేసి పూటకు మూడు గ్రాముల చొప్పున నిమ్మకాయంత పరిమాణంలో ఆవు వెన్నతో కలిపి తింటుండడం వల్ల వృధాప్య ఛాయలు తగ్గుతాయి. ఒక గ్లాస్ నీటిలో మేడి చెక్కను పగలకొట్టి వేసి ఒక కప్పు కషాయం అయ్యే వరకు మరిగించి వడకట్టాలి. అందులో ఒక టీ స్పూన్ బార్లీ గింజల పొడి, ఒక టీ స్పూన్ పటిక బెల్లం పొడిని కలిపి తాగుతూ ఉంటే గర్భస్రావం అవకుండా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.