ఇటీవల కాలంలో రోడ్లపై భారీ ట్రక్కులు తరుచు కనిపిస్తున్నాయి. ఇవి ఎక్కువ బరువు కలిగిన వాటిని సుదూర ప్రాంతాలకు తీసుకువెళ్తుంటాయి. రోడ్లపై ఇవి ప్రయాణిస్తుంటే అందరి చూపు వీటిపైనే ఉంటుంది. భారీ సైజు ఉన్న వాటిని విమానాల్లో, జలమార్గాల ద్వారా తీసుకేళ్లలేని విధంగా ఉన్న ప్రాంతాలకు ఇలాంటి పెద్ద ట్రక్కుల సహయంతో గమ్యస్థానానికి చేరవేస్తుంటారు. ఇదిలా ఉంటే పెద్ద పెద్ద సైజుల్లో ఉన్న బాయిలర్‌లను భారీ ట్రక్కులు తీసుకెళ్తున్న ఘటన హర్యానా రోడ్లపై కనిపించింది. చూడటానికి పెద్ద కొండల మాదిరిగా ఉన్న ట్రక్కులు రోడ్డుపై వెళ్తుంటే అటువైపుగా వెళ్లేవారు తమ వాహనాలను నిలుపుకుని ఆసక్తి చూస్తున్నారు. ప్రస్తుతం ఈ భారీ ట్రక్కులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ భారీ ట్రక్కుల గురించిన పూర్తి వివరాలను చూసినట్లయితే, ఇవి గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవు నుంచి 1,150 కిలోమీటర్ల దూరంలో హర్యానాలోని పానిపట్‌కు సమీపంలోని చమురు శుద్ధి కర్మాగారాల్లో ఉపయోగించే కోక్ బాయిలర్‌లను మోసుకెళ్తున్నాయి. ట్రక్కులు దాదాపు ఒక్కోటి 400 టైర్లను కలిగి ఉన్నాయి. ఈ బాయిలర్లు చాలా పెద్దగా ఉన్నాయి. వీటి బరువు దాదాపు 8 లక్షల కిలోలు ఉంటుందని సంబంధిత వర్గాల వారు పేర్కొంటున్నారు. ఈ రేంజ్‌లో బరువు అంటే మామూలు విషయం కాదు. వీటిని విమానాల ద్వారా కచ్చితంగా తీసుకెళ్లలేరు. షిప్‌ల ద్వారా కూడా రవాణా చాలా కష్టం. దీంతో రోడ్డు మార్గం నుంచే వీటిని హర్యానాకు తరలిస్తున్నారు. 400 టైర్లతో పైన భారీ బరువుతో వెళ్తున్న ట్రక్కులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, వీటి ప్రయాణం ప్రారంభమై ఏడాది దాటిపోయింది. కానీ ఇంకా కూడా తమ గమ్యస్థానానికి చేరుకోలేదు. పైన భారీ బరువు ఉండటంతో ట్రక్కులు మెల్లగా కదులుతున్నాయి. ఈ భారీ ట్రక్కులు రోజుకు దాదాపు 25 కి.మీ వరకు మాత్రమే ప్రయాణిస్తాయి. ఎందుకంటే మరింత ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే, బాయిలర్‌లు అదుపుతప్పి క్రింద పడే అవకాశం ఉంది. చూడటానికి బాహుబలి మాదిరిగా కనిపిస్తున్న ట్రక్కులు పెద్ద బరువును మోసుకుంటూ 3,500 హార్స్‌పవర్‌తో హర్యానా రోడ్లపై ప్రయాణిస్తున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఇవి హర్యానాలోని చమురు శుద్ధి కర్మాగారాలకు చేరడానికి ఇంకా రెండు లేదా మూడు నెలల సమయం పడుతుందని ట్రక్కుల డ్రైవర్లు పేర్కొన్నారు.
ఏడాది నుంచి ప్రయాణిస్తున్న ఈ ట్రక్కుల్లో పలు కారణాల వలన 200 టైర్లను మార్చారు. ఇవి ప్రయాణిస్తున్న మార్గంలో కొన్ని చోట్ల రోడ్డు సరిగ్గా లేకపోవడంతో ట్రక్కుల సాఫీ ప్రయాణం కోసం కొన్ని వంతెనలను కూడా నిర్మించారు. అలాగే వీటి నిర్వహణకు సంబంధించి దాదాపు 250 ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారంతా కూడా ప్రతిరోజు ట్రక్కులు వెళ్లే మార్గాలను ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంటారు. అలాగే అవి సాఫీగా ప్రయాణించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల, ఈ ట్రక్కులు నర్వానాలోని సిర్సా బ్రాంచ్ కెనాల్‌ను దాటాడానికి దాని నిర్వహణ సిబ్బంది తాత్కాలిక వంతెనను ఏర్పాటు చేసి వాటిని విజయవంతంగా దాటించారు. ఏడాది కాలంగా ఇవి రోడ్లపై ఇలా దేశమంతా ప్రయాణిస్తున్నాయంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం ఈ ట్రక్కులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్‌మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు.