Stress : ప్రస్తుత తరుణంలో చాలా మంది అధిక ఒత్తిడి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇల్లు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరికి ఒత్తిడి అనేది ఎదురవుతూనే ఉంటోంది. ఇది మానసిక సమస్యలకు దారి తీస్తోంది. దీని వల్ల డిప్రెషన్‌కు గురై ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. అయితే కింద తెలిపిన విధంగా ఆసనాన్ని రోజూ వేస్తే.. ఎంతటి ఒత్తిడి అయినా సరే మటుమాయం అవుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. మరి ఆ ఆసనం ఏమిటి ? దాన్ని ఎలా వేయాలి ? అంటే..
అధిక ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలను తగ్గించుకునేందుకు సమకోణాసనం పనిచేస్తుంది. దీన్ని ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నేలపై నిలబడి కాళ్లను దగ్గరగా ఉంచాలి. తరువాత ముందుకు వంగాలి. ఇలా వంగినప్పుడు శరీర భంగిమ ఆంగ్ల అక్షరం ఎల్ ఆకారంలో ఉండాలి. నడుం దగ్గర వంగి ముందుకు శరీరాన్ని నిటారుగా ఉంచాలి. తరువాత రెండు చేతులను ముందుకు చాపి వాటి మధ్య కాస్త దూరం ఉండేలా చూసుకోవాలి. ముఖాన్ని కిందకు ఉంచి నేలను చూడాలి. ఇలా ఈ భంగిమలో వీలైనంత సేపు ఉండాలి.
ఈ సమకోణాసనాన్ని రోజూ కనీసం 10 నిమిషాలు చేయాలి. దీంతో అధికంగా ఉండే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనస్సుకు హాయిగా ఉంటుంది. నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. ఈ ఆసనం వేయడం వల్ల శరీరంలోని కండరాలు అన్నీ రిలాక్స్ అవుతాయి. కండరాల నొప్పులు తగ్గుతాయి. అలాగే వెన్నెముక దృఢంగా మారుతుంది. రోజూ కంప్యూటర్‌ల ఎదుట కూర్చుని పనిచేసేవారికి ఈ ఆసనం ఎంతో ఉపయోగంగా ఉంటుంది. మెడ నొప్పి కూడా తగ్గుతుంది.
మోకాళ్ల నొప్పులు ఉన్నవారు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, కాళ్లలో సమస్యలు ఉన్నవారు.. ఈ ఆసనాన్ని వేయకూడదు. దీన్ని రోజుకు కనీసం 10 సార్లు లేదా 10 నిమిషాల పాటు వేస్తే సరైన ఫలితం లభిస్తుంది.