యోగాలో అందుబాటులో ఉన్న అనేక ఆసనాల్లో మత్స్యాసనం కూడా ఒకటి. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే చాలు. దీన్ని వేయడం చాలా సులభమే ఆరంభంలో ఈ ఆసనంలో 30 సెకన్ల పాటు ఉండాలి. తరువాత సమయాన్ని పెంచాలి. ఈ ఆసనాన్ని ఎలా వేయాలో, దీంతో ఏమేం ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మత్స్యాసనం వేసే విధానం
నిటారుగా కూర్చుని కుడిపాదాన్ని ఎడమ తొడపై ఎడమ పాదాన్ని కుడి తొడపై ఉంచాలి. తరువాత నెమ్మదిగా వెనక్కి వాలుతూ తలను నేలకు ఆనించాలి. మోచేతుల్ని నేలకు ఆనిస్తూ కాలి బొటన వేళ్లను పట్టుకోవాలి. ఈ ఆసనంలో 30 సెకన్ల నుంచి నిమిషం దాకా ఉండే ప్రయత్నం చేయాలి. తరువాత ముందుగా చేతుల్ని నేల మీద ఆనించి యథా స్థితికి రావాలి. సర్వాంగాసనం వేసే వారు దాని తరువాత ఈ ఆసనాన్ని తప్పనిసరిగా వేయాలి. ఈ ఆసనం వేయడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.
మత్స్యాసనం వల్ల కలిగే ప్రయోజనాలు
1. మత్స్యాసనం వేయడం వల్ల మెడ, ఊపిరితిత్తులు, జీర్ణాశయం తదితర భాగాలకు ఎంతో మేలు కలుగుతుంది. ఆయా అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఛాతి పరిమాణం పెరుగుతుంది.
2. ఊపిరితిత్తులు ఆక్సిజన్‌ను ఎక్కువగా గ్రహిస్తాయి. శ్వాస సమస్యలు ఉండేవారికి ఇది మేలు చేస్తుంది.
3. వెన్నెముక దృఢంగా మారుతుంది. నిత్యం కంప్యూటర్ల ఎదుట కూర్చుని పనిచేసే వారికి మేలు కలుగుతుంది. వెన్ను సులభంగా కదులుతుంది.
4. ఈ ఆసనం వేయడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మెరుగు పడుతుంది. హైపో, హైపర్ థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి మేలు కలుగుతుంది.
గమనిక : హై లేదా లో బీపీ ఉన్నవారు, మైగ్రేన్ సమస్య, నిద్రలేమితో బాధపడేవారు, వెన్ను నొప్పి ఉన్నవారు, ఇటీవలే సర్జరీ చేయించుకున్న వారు దీన్ని సాధన చేయరాదు. అలాగే వరిబీజం ఉన్నవారు, ఛాతి లేదా మెడ నొప్పి ఉన్నవారు దీన్ని వేయరాదు. ఆయా నొప్పులు తగ్గాక వేయడం మంచిది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365