మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు యోగా, వ్యాయామాలు ఎంత దోహదం చేస్తాయో.. ధ్యానం కూడా అంతే దోహదపడుతుంది. ధ్యానం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. దీంతోపాటు ప్రశాంతమైన జీవితం గడపవచ్చు. అయితే ధ్యానం చేయాలనుకునే వారు ముందుగా ఎలా ప్రారంభించాలి ? అనే విషయం తెలియక సతమతం అవుతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన సూచనలు పాటిస్తే ధ్యానం చేయడం సులభంగా అలవాటు అవుతుంది. మరి ఆ సూచనలు ఏమిటంటే…
1. ధ్యానాన్ని నిత్యం ఉదయాన్నే నిద్ర లేవగానే కాలకృత్యాలు తీర్చుకుని దంతధావనం చేసి మొదలు పెట్టవచ్చు. తాజాదానం కోరుకుంటే వ్యాయామం చేశాక స్నానం చేసి ధ్యానం చేయవచ్చు.
2. ధ్యానం చేసేవారు తమ చుట్టూ ఎలాంటి శబ్దాలు, చప్పుళ్లు లేకుండా చూసుకోవాలి. అవసరం అయితే ప్రశాంతంగా ఉన్న చోటుకు వెళ్లాలి. ప్రకృతిలో ధ్యానం చేస్తే ఇంకా మంచిది.
3. మన వీలును బట్టి ఎంత సేపైనా ధ్యానం చేయవచ్చు. కానీ ఆరంభంలో ఉన్నవారు నిత్యం 5 నిమిషాలతో మొదలు పెడితే మంచిది. అలా అలా సమయాన్ని పెంచుతూ పోవచ్చు.
4. ధ్యానం చేసే సమయంలో దృష్టిని ధ్యానం మీదే కేంద్రీకరించాలి. ఏ విషయాన్నీ ఆలోచించకూడదు. ఇతర విషయాల మీదకు ఆలోచనలు మళ్లకూడదు.
5. ధ్యానం చేసేటప్పుడు శ్వాస మీద దృష్టి పెట్టాలి.
6. ఊపిరిపీల్చేటప్పుడు 3 లెక్క బెట్టాలి. ఊపిరి వదిలేటప్పుడు 5 లెక్కబెట్టాలి.
7. ఇతర విషయాల మీదకు ఆలోచనలు మళ్లుతున్నాయి అనుకుంటే వెంటనే శ్వాస మీద దృష్టి ఉంచాలి.
ఇలా నిత్యం ధ్యానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు 5 నిమిషాల పాటు ధ్యానం చేస్తే చక్కని నిద్రను కూడా పొందవచ్చు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచాక మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది. కొత్త ఆలోచనలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. రిలాక్స్‌డ్‌గా ఉంటారు.