Yoga : యోగాలో మనకు అనేక రకాల ఆసనాలు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా సరే తమకు అనుగుణంగా, సౌకర్యవంతంగా ఉండే ఆసనాన్ని వేస్తుంటారు. కానీ ఎవరైనా సరే సులభంగా వేయదగిన ఆసనం ఒకటి ఉంది.. అదే వజ్రాసనం. దీన్ని రోజూ 15 నిమిషాలు వేస్తే చాలు, అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు.
వజ్రాసనాన్ని వేయడం చాలా సులభమే. నేలపై కూర్చుని మోకాళ్లను మడిచి వెనకగా పిరుదుల కిందుగా పాదాలను పెట్టుకోవాలి. వెన్నెముకను నిటారుగా ఉంచి నేరుగా చూడాలి. రెండు అరచేతులను రెండు మోకాళ్లపై పెట్టాలి. ఈ భంగిమలో 15 నిమిషాల పాటు ఉండాలి.
అయితే ప్రస్తుత జీవన విధానంలో చాలా మంది కింద కూర్చోవడం లేదు. కనుక ఈ ఆసనం వేయడం ఆరంభంలో కొద్దిగా కష్టంగా ఉంటుంది. కానీ నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తే రోజూ ఈ ఆసనాన్ని అలవోకగా వేయవచ్చు. మొదటగా 5 నిమిషాలతో మొదలు పెట్టి క్రమంగా సమయాన్ని పెంచుతూ పోవాలి. రోజుకు 15 నిమిషాల పాటు ఈ వ్యాయామం చేస్తే చాలు, అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
ఒత్తిడితో బాగా సతమతం అవుతున్నవారు ఈ వ్యాయామాన్ని చేస్తే ఫలితం ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నిద్రలేమి సమస్య తగ్గుతుంది. చక్కగా నిద్ర పడుతుంది.
జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఈ ఆసనం వేయడం వల్ల ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి.
అధిక బరువు తగ్గాలనుకునేవారు ఈ ఆసనాన్ని వేస్తే బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. మహిళలకు రుతు సమయంలో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. మూత్రాశయ సమస్యలు ఉన్నవారు, వెన్ను నొప్పి ఉన్నవారికి ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.