India Vs Sri Lanka : బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక చాలా పరుగులు వెనుకబడింది. ఈ క్రమంలోనే భారత బౌలర్లు విజృంభించడంతో ఆ జట్టు ఆలౌట్ అయింది. ఫలితంగా లంక జట్టుపై భారత్ 238 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 2-0 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా తన తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేసి ఆలౌట్ అయింది. శ్రేయాస్ అయ్యర్ 92 పరుగులు చేసి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును అందించాడు. లంక బౌలర్లలో లసిత్ ఎంబుల్ దెనియా, ప్రవీణ్ జయవిక్రమ చెరో 3 వికెట్లు తీశారు. ధనంజయ డిసిల్వ 2, సురంగ లక్మల్ 1 వికెట్ తీశారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన లంక కేవలం 109 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లలో ఏంజెలో మాథ్యూస్ 43 పరుగులతో కాసేపు క్రీజులో నిలిచాడు. కానీ జట్టును ఆదుకోలేకపోయాడు. ఇక మిగిలిన ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో జస్‌ప్రిత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు. రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీలు చెరో 2 వికెట్లు తీశారు. అక్షర్ పటేల్‌కు 1 వికెట్ దక్కింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన భారత్ 9 వికెట్లు కోల్పోయి 303 పరుగుల స్కోరు వద్ద ఉన్నప్పుడు ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో భారత బ్యాట్స్‌మెన్‌లలో రిషబ్ పంత్ (50), శ్రేయాస్ అయ్యర్ (67), రోహిత్ శర్మ (46) రాణించారు. లంక బౌలర్లలో ప్రవీణ్ జయవిక్రమ 4 వికెట్లు తీయగా.. లసిత్ ఎంబుల్ దెనియా 3, విశ్వ ఫెర్నాండో, ధనంజయ డిసిల్వ 1 వికెట్ చొప్పున తీశారు.
ఇక రెండో ఇన్నింగ్స్ ఆడిన లంక 208 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌లలో దిముత్ కరుణరత్నె 107 పరుగులు, కుశాల్ మెండిస్ 54 పరుగులతో ఆకట్టుకున్నారు. కానీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. దీంతో భారత్ భారీ తేడాతో విజయం సాధించింది. ఇక భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు తీయగా.. జస్‌ప్రిత్ బుమ్రా 3, అక్షర్ పటేల్ 2, రవీంద్ర జడేజా 1 వికెట్ చొప్పున తీశారు.